BJP chief | బీజేపీ తదుపరి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను కమలం పార్టీ వేగవంతం చేసింది. ఈ నెల చివరి నాటికి కమలం పార్టీకి కొత్త సారథి రానున్నట్లు తెలిసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
పార్టీ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అధ్యక్షుడిని (BJP national president) ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న సంస్థాగత ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. 19 రాష్ట్ర అధ్యక్షుల పేర్లను ప్రకటించిన తర్వాత.. పార్టీ తదుపరి జాతీయ అధ్యక్షుడి కోసం ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే, ఇప్పటికే 14 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. ఆయా రాష్ట్ర అధ్యక్షుల పేర్లను కూడా ప్రకటించారు.
కీలక రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల అధ్యక్షుల పేర్లు ఖరారు కావాల్సి ఉంది. ఇందుకోసం పార్టీ అగ్రనాయకత్వం విస్తృత చర్చలు జరుపుతోంది. ఈ రాష్ట్రాలకు రెండు, మూడు రోజుల్లో అధ్యక్షులను నియమించే అవకాశం ఉంది. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడి నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరికి లేదా వచ్చే నెల ఆరంభంలో ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు పార్టీ అంతర్గత వ్యక్తుల ద్వారా తెలిసింది.
కాగా, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా (JP Nadda) ఉన్న విషయం తెలిసిందే. 2020లో ఆయన బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఇక ఇటీవలే కేంద్రంలో ఎన్డీయే కూటమి మూడోసారి అధికారింలోకి వచ్చిన తర్వాత నడ్డాను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడితోపాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు. ఇక పార్టీ చీఫ్ పదవీకాలం మూడు సంవత్సరాలే. దీంతో ఇటీవలే ఆయన పదవీకాలం ముగిసింది. అయితే, 2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు.
బీజేపీ తొలి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి 1980 నుంచి 1986 వరకు పనిచేశారు. లాల్ కృష్ణ అద్వాణి పలుమార్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1986-1990, 1993-1998, 2004-2005 వరకు ఆయన ఆ పదవీ బాధ్యతలు నిర్వహించారు. మురళీ మనోహర్ జోషి 1991 నుంచి 1993 వరకు, కుషబావు థాకరే 1998 నుంచి 2000 వరకు, బంగారు లక్ష్మణ్ 2000 నుంచి 2001 వరకు, కె జానాకృష్ణమూర్తి 2001 నుంచి 2002 వరకు, ఎం వెంకయ్యనాయుడు 2002 నుంచి 2004 వరకు, రాజ్నాథ్ సింగ్ 2005 నుంచి 2009 వరకు, 2013 నుంచి 2014 వరకు, నితిన్ గడ్కరి 2010 నుంచి 2013 వరకు, అమిత్షా 2014 నుంరి 2017 వరకు, 2017 నుంచి 2020 వరకు అధ్యక్షులుగా పనిచేశారు. జేపీ నడ్డా 2020 జనవరి 20న పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై అప్పటి నుంచి పదవిలో కొనసాగుతున్నారు.
Also Read..
ATM on Train | ఇక రైళ్లలోనూ ఏటీఎం సేవలు!.. పంచవటి ఎక్స్ప్రెస్లో ప్రారంభం
Justice BR Gavai | తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్
Diabetes | టైప్-5 డయాబెటిస్!.. పోషకాహార లోపంతో బాధపడే టీనేజర్లు, యువతకు ముప్పు!