Diabetes | న్యూఢిల్లీ : టైప్ 5 డయాబెటిస్.. కొత్త రకం మధుమేహం ఇది. సన్నగా, పోషకాహార లోపంతో బాధపడే టీనేజర్లకు, యువతకు ఈ డయాబెటిస్ సోకుతుంది. అనేక దశాబ్దాల తర్వాత దీనిని అధికారికంగా గుర్తించారు. అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య (ఐడీఎఫ్) బ్యాంకాక్‌లో నిర్వహించిన ప్రపంచ మధుమేహ కాంగ్రెస్‌లో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్లకు భిన్నమైన, పోషకాహార లోపానికి సంబంధించిన మధుమేహానికి గుర్తింపునిచ్చి, టైప్ 5 డయాబెటిస్‌గా నామకరణం చేశారు. డాక్టర్ మెరిడిత్ హాకిన్స్ పరిశోధనల ఫలితంగా దీనిని ప్రత్యేక క్యాటగిరీగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 2-2.5 కోట్ల మంది టైప్-5 డయాబెటిస్తో బాధపడుతున్నట్టు అంచనా. వీరిలో అత్యధికులు ఆసియా, ఆఫ్రికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందినవారే.
టైప్ 5 డయాబెటిస్‌ను పోషకాహార లోపానికి సంబంధించిన మధుమేహం అని పిలుస్తారు. ఇది ముఖ్యంగా బాల్యంలో సన్నగా, సుదీర్ఘ కాలం పోషకాహార లోపంతో జీవించినవారికి సోకుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు సంబంధించినది. కానీ టైప్ 5 డయాబెటిస్ పాంక్రియాస్ దయనీయంగా ఉండటం వల్ల వస్తుంది. అనేక సంవత్సరాలపాటు పోషకాహారం లేకపోవడం వల్ల సోకుతుంది. ఈ వ్యాధి సోకినవారికి తగినంత ఇన్సులిన్‌ను తయారు చేయడం కష్టంగా ఉంటుంది. బ్లడ్ సుగర్ లెవెల్స్‌ను నియంత్రించడానికి ఇన్సులిన్ హార్మోన్ దోహదపడుతుంది. అయితే, టైప్ 2 డయాబెటిస్ రోగుల మాదిరిగా కాకుండా, టైప్ 5 డయాబెటిస్ రోగుల శరీరాలు ఇన్సులిన్‌కు స్పందించే తీరు బాగానే ఉంటుంది. దీనివల్ల టైప్ 1, టైప్ 2 డయాబెటిస్లకన్నా టైప్ 5 డయాబెటిస్ భిన్నమైనదిగా గుర్తింపు పొందింది. టైప్ 5 డయాబెటిస్ రోగుల్లో చాలా మందికి ఇన్సులిన్ ఇంజెక్షన్ల అవసరం ఉండకపోవచ్చు. వీరికి ఓరల్ మెడిసిన్స్‌తోనే చికిత్స చేయవచ్చు. దీనివల్ల అల్పాదాయ పరిస్థితుల్లో చికిత్స అందుబాటులో ఉంటుంది.
పోషకాహార లోపానికి సంబంధించిన మధుమేహాన్ని మొదట 1950లలోనే గుర్తించినప్పటికీ, అంతర్జాతీయ పరిశోధనల్లో దీనికి అంత ప్రాధాన్యం దక్కలేదు. 1985లో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ప్రత్యేక క్యాటగిరీగా వర్గీకరించింది. అయితే కానీ 1999లో ఈ క్యాటగిరీని ఉపసంహరించింది. పోషకాహార లోపం లేదా ప్రొటీన్ కొరత వల్ల మధుమేహం వస్తున్నట్లు తెలిపే ఆధారాలు లేవని చెప్పింది. 2010లో డాక్టర్ హాకిన్స్ గ్లోబల్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటుచేసి, దీనిపై పరిశోధనలు జరిపారు. 2022లో ఆమె బృందం జరిపిన అధ్యయనంలో పోషకాహార లోప మధుమేహానికి ఆధారాలు గుర్తించారు.