Justice BR Gavai | న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 : తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేరును సీజేఐ సంజీవ్ ఖన్నా బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. సంజీవ్ ఖన్నా తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ గవాయ్. మే 13న సీజేఐ ఖన్నా పదవీ విరమణ చేయనుండగా 52వ సీజేఐగా జస్టిస్ గవాయ్ మే 14న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. 2019 మే 24న సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చిన జస్టిస్ గవాయ్ సీజేఐగా ఆరు నెలలకుపైగా కొనసాగుతారు. 2025 నవంబర్ 23న ఆయన పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ కావడం విశేషం.
1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమ్రావతిలో జన్మించిన జస్టిస్ గవాయ్ 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2005 నవంబర్ 12న అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనేక చరిత్రాత్మక తీర్పులను వెలువరించిన సుప్రీంకోర్టుకు చెందిన పలు రాజ్యాంగ ధర్మాసనాలలో జస్టిస్ గవాయ్ కూడా ఉన్నారు. పూర్వ జమ్మూ కశ్మీరు రాష్ర్టానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా ఉన్నారు. రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసిన మరో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయ్ సభ్యుడిగా ఉన్నారు.
రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం 2016లో తీసుకున్న నిర్ణయాన్ని 4:1 మెజారిటీతో ఆమోదించిన మరో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయ్ పాత్ర ఉంది. ఎస్సీల వర్గీకరణ చేపట్టేందుకు రాష్ర్టాలకు అధికారాలను అందచేస్తూ 6:1 మెజారిటీతో తీర్పును వెలువరించిన ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయ్ ఉన్నారు. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఓ ముఖ్యమైన తీర్పును వెలువరిస్తూ 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఏ ఆస్తినీ కూల్చరాదని ఆదేశిస్తూ దేశవ్యాప్తంగా మార్గదర్శకాలు జారీచేసింది. అడవులు, వన్యప్రాణులు, చెట్ల పరిరక్షణకు సంబంధించిన అంశాలను విచారించే ధర్మాసనాలకు ఆయన సారథ్యం వహిస్తున్నారు.