పాట్నా: ఒక యూనివర్సిటీ విడుదల చేసిన ఫలితాలు చూసి విద్యార్థులు నోరెళ్లబెట్టారు. ఒక విద్యార్థికి మొత్తం వంద మార్కులకు గాను 257 మార్కులు వచ్చాయి. అయినా ఆ స్టూడెంట్ తప్పాడు. యూనివర్సిటీ ఫలితాలు (Bihar university) తప్పులతడకగా ఉండటంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్‌లో ఈ సంఘటన జరిగింది. ముజఫర్‌పూర్‌లోని బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ బీహార్ విశ్వవిద్యాలయం ఇటీవల పోస్ట్ గ్రాడ్యుయేట్ మూడవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. సుమారు 9,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 8,000 మంది ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు.
కాగా, హిందీ, ఇంగ్లీష్, సైన్స్ విభాగాల మార్కుల్లో తప్పులు కనిపించాయి. ఒక విద్యార్థికి 100 మార్కుల థియరీ పేపర్కుగాను 257 మార్కులు వచ్చాయి. అలాగే 30 మార్కుల ప్రాక్టికల్ పరీక్షలో 225 మార్కులు వచ్చాయి. అయినప్పటికీ ఆ విద్యార్థి పాస్ కాలేదు. సుమారు వంద మందికిపైగా విద్యార్థుల రిజల్ట్ పెండింగ్‌లో ఉంచారు. తప్పులతడకగా మార్కులు విడుదల చేయడం, కొందరి ఫలితాలు పెండింగ్‌లో ఉంచడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కాలేజీలు ఇంటర్నల్ మార్కులను యూనివర్సిటీకి పంపలేదని పలువురు స్టూడెంట్స్ ఆరోపించారు.
మరోవైపు యూనివర్సిటీ ఎగ్జామ్ కంట్రోలర్ ప్రొఫెసర్ రామ్ కుమార్ దీనిపై స్పందించారు. కొంతమంది విద్యార్థులు మొత్తం మార్కులను మించి మార్కులు పొందినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఎక్సెల్ షీట్లో మార్కుల ఎంట్రీ సమయంలో తప్పులు జరిగినట్లు గుర్తించామన్నారు. ఆ లోపాలను సరిదిద్దినట్లు వివరించారు. భవిష్యత్తులో ఇలా జరుగకుండా జాగ్రత్తలు పాటించాలని కంప్యూటర్ ఆపరేటర్‌ను హెచ్చరించినట్లు వెల్లడించారు.
Also Read:
Eknath Shinde | ‘జై గుజరాత్’ అంటూ.. ప్రసంగం ముగించిన ఏక్నాథ్ షిండే