Bomb Threat | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో 15కి పైగా పాఠశాలలకు (schools) శుక్రవారం ఉదయం బెదిరింపు ఈమెయిల్స్ (email) రావడం తీవ్ర కలకలం రేపింది. ఆయా పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు (Bomb Threat) ఆగంతకులు మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సహా పాఠశాల సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
శుక్రవారం ఉదయం బసవేశ్వర్ నగర్లోని నేపెల్, విద్యాశిల్పతో సహా ఏడు పాఠశాలలకు ముందుగా బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే నగరంలోని పలు పాఠశాలలకు అదే తరహా బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులకు గురైన పాఠశాలల్లో ఒకటి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) నివాసానికి ఎదురుగా ఉండటం గమనార్హం.
దీంతో రంగంలోకి దిగిన బెంగళూరు పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలోని విద్యార్థులు, సిబ్బందిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటి వరకూ ఎలాంటి అనుమానిత వస్తువూ ఆయా పాఠశాలల్లో లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బెదిరింపు మెయిల్ ఆధారంగా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, గతేడాది కూడా బెంగళూరు నగరంలోని పలు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అయితే ఆ తర్వాత అవన్నీ బూటకమని తేలింది. ఇప్పుడు అదేతరహా బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.
Also Read..
Viral Video | ప్రయాణికుల సాక్షిగా కదులుతున్న రైల్లో ఒక్కటైన ప్రేమ జంట.. వీడియో
Air India | విమానంలో క్యాబిన్ పైకప్పు నుంచి నీటి లీకేజీ.. స్పందించిన ఎయిర్ ఇండియా
Pulwama | పుల్వామాలో ఎన్కౌంటర్.. ముష్కరుడు హతం