Black Fever | పశ్చిమ బెంగాల్లో బ్లాక్ ఫీవర్ కలకలం సృష్టిస్తున్నది. గత రెండువారాల్లో 65 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. డార్జిలింగ్, మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ్ దినాజ్‌పూర్, కాలింపోంగ్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. అయితే, బెంగాల్లో బ్లాక్ ఫీవర్‌ను నిర్మూలించామని, ఇటీవల మరోసారి నిఘా వేయగా 11 జిల్లాల్లో 65 కేసులు రికార్డయ్యాయని ఆ అధికారి తెలిపారు. బీర్భూమ్, బంకురా, పురూలియా, ముర్షిదాబాద్ జిల్లాల్లో పలు బ్లాక్ ఫీవర్ కేసులు కేసులు రికార్డయ్యాయి.
బ్లాక్ ఫీవర్ ప్రధానంగా ‘లీష్మానియా డోనోవానీ’ అనే పరాన్నజీవి సోకిన సాండ్ ఈగలు (sand flies) కుట్టంతో సోకుతుంది. అధికారిక సమాచారం ప్రకారం.. బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అయితే, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వారిలోనే ఎక్కువగా లక్షణాలు బయటపడుతున్నాయని అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు లక్షణాలు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్లాక్ ఫీవర్ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.
బ్లాక్ ఫీవర్ సోకిన వారందరికీ ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించినట్లు సచివాలయ అధికారి తెలిపారు. రోగులకు పౌష్టికాహారం ఇచ్చేందుకు సైతం ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్లాక్ ఫీవర్ గుర్తించిన ప్రైవేట్ లేబోరేటరీ లేదంటే ఆసుపత్రిలో ఎక్కడ గుర్తించినా సంబంధిత వైద్యుడు వెంటనే విషయాన్ని జిల్లా ఆరోగ్యశాఖ అధికారి దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. భోజనంతో పాటు చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ రాష్ట్ర ఆరోగ్యశాఖ బరిస్తుందని, జిల్లా చీఫ్ హెల్త్ ఆఫీసర్ ప్రక్రియను పర్యవేక్షిస్తారని పేర్కొంది.