Climate Migrants : వాతావరణ మార్పుల (Climate change) కారణంగా ఒక దేశం నెమ్మదిగా సముద్రంలో కనుమరుగై పోతున్నది. పొరుగున ఉన్న మరో దేశం అక్కడి ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ అండగా నిలుస్తున్నది. ఇక్కడ కనుమరుగై కలవరపెడుతున్న దేశం తువాలు (Tuvalu) కాగా, తువాలు పౌరులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశం ఆస్ట్రేలియా (Australia). గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన చరిత్రాత్మక ఒప్పందం కింద, తువాలు నుంచి తొలి వలసదారుల బృందం ఈ వారం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది.
వాతావరణ మార్పులవల్ల ముంపునకు గురవుతున్న తమ పౌరులకు ‘గౌరవప్రదమైన వలస’ అవకాశం కల్పించాలని తువాలు చేసిన విజ్ఞప్తి మేరకు 2023లో ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం.. తువాలు పౌరులకు ఆస్ట్రేలియా ప్రత్యేక వీసాలు జారీ చేస్తున్నది. ఆ వీసా ద్వారా వారు ఆస్ట్రేలియాలో నివసించవచ్చు, చదువుకోవచ్చు, పని చేసుకోవచ్చు. అర్హత సాధించిన వారికి ఆస్ట్రేలియా పౌరసత్వం కూడా లభిస్తుంది.
అంతేగాక ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన వెంటనే తువాలు వలసదారులకు విద్య, వైద్య బీమా (మెడికేర్), ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయి. సుమారు 11 వేల జనాభా మాత్రమే ఉన్న తువాలు దేశం నుంచి ఈ ఏడాది జూన్లో వీసా దరఖాస్తులు ప్రారంభం కాగానే 3 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే తువాలులో మేధోవలసను (brain drain) నివారించేందుకు ఏటా కేవలం 280 మందికి మాత్రమే వీసాలు జారీ చేయాలని నిర్ణయించారు.
ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రమవుతున్న వేళ తువాలు పౌరులకు ఆస్ట్రేలియాలో కొత్త జీవితం ప్రారంభించే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. మరోవైపు తమ దేశ సంస్కృతి, సంప్రదాయాలను ఎప్పటికీ మరిచిపోవద్దని వలస వెళ్తున్న పౌరులకు తువాలు ప్రధాని ఫెలెటి టియో సూచించారు.