Bhagwant Mann : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjyot Singh Siddu) పై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) తీవ్ర విమర్శలు గుప్పించారు. క్షేత్రస్థాయిలో పనితీరు కనబరచకుండానే ఉన్నత పదవులు ఆశించడం వారిద్దరిలో ఉన్న ప్రధాన సమస్య అని మాన్ ఎద్దేవా చేశారు.
‘నన్ను ప్రధానిని చేయండి, నేను ఏదో ఒకటి చేస్తా’ అని రాహుల్ గాంధీ చెబుతుంటారని, కానీ దేశ ప్రజలు మాత్రం ముందు మీరు ఏదైనా చేసి చూపించండి, ఆ తర్వాతే మిమ్మల్ని ప్రధానిని చేసే విషయం ఆలోచిస్తామని అంటున్నారని మాన్ తెలిపారు. పంజాబ్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారని ఆయన విమర్శించారు.
తనను ముఖ్యమంత్రిని చేయాలని సిద్ధూ పంజాబ్ ప్రజలను కోరుతున్నారని, కానీ ముందు మీ పనితీరు చూపించండి, ఆ తర్వాత ఆలోచిస్తామని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారని మాన్ అన్నారు. అధికారాన్ని డిమాండ్ చేయడం కాదని, ప్రజాస్వామ్యంలో దాన్ని పనితీరుతో సంపాదించుకోవాలని సూచించారు.
కాగా ఇటీవల నవజ్యోత్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ పంజాబ్ కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో భగవంత్ మాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్లో జవాబుదారీతనం, స్పష్టత లేవనడానికి ఇలాంటి బహిరంగ విమర్శలే నిదర్శనమని ఆయన విమర్శించారు.