ఆదివారం 12 జూలై 2020
National - Jun 18, 2020 , 21:11:01

చైనా ఉత్పత్తులను బహిష్కరించండి!

చైనా ఉత్పత్తులను బహిష్కరించండి!

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగి 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న చైనాపై యావత్‌ భారతం ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నది. ఈ క్రమంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని పేర్కొంటూ ‘బాయ్‌కాట్‌ చైనా’ నినాదం మెల్లమెల్లగా ఊపందుకొంటున్నది. చైనా తయారీ వస్తువులను వాడొద్దని, వాటిని బహిష్కరించాలని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే కార్యాలయాల్లో ఆ దేశానికి చెందిన వస్తువులను వినియోగించవద్దని అధికారులకు సూచించారు. 

‘మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులను చైనాతోపాటు విదేశాలు క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మన బాస్మతీ బియ్యం ఎగుమతులపై నిషేధం విధించారు. అయితే, వాళ్ల వస్తువులపై మన దగ్గర నాణ్యతాపరమైన కచ్చితమైన నిబంధనలు ఏవీ లేవు’ అని చెప్పారు. మరోవైపు, భారత్‌లో చైనా ఆహార పదార్థాలను విక్రయించే హోటళ్లు, రెస్టారెంట్లను వెంటనే మూసివేయాలని మరో కేంద్ర మంత్రి రాందాస్‌ అథావలే డిమాండ్‌ చేశారు. చైనాలో తయారైన అన్ని వస్తువులను భారతీయులంతా నిషేధించాలని ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు.


చైనా వస్తువులకు ప్రచారాన్ని ఆపండి

చైనా ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్న సెలబ్రిటీలు వెంటనే వాటిని నిలిపివేయాలని ఆలిండియా ట్రేడర్స్‌ సమాఖ్య విజ్ఞప్తి చేసింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లకు మనమిచ్చే గౌరవం ఇదేనని తెలిపింది. చైనా ఉత్పత్తులకు వాణిజ్య ప్రచారం నిర్వహిస్తున్న అమీర్‌ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌, దీపికా పదుకొనె, కత్రినా కైఫ్‌, శిల్పాశెట్టి, మాధురీ దీక్షిత్‌, విరాట్‌ కోహ్లీ, మహేంద్రసింగ్‌ ధోని, సచిన్‌ టెండుల్కర్‌కు ఈ మేరకు అఖిలభారత వ్యాపారుల సమాఖ్య లేఖలు రాసింది.  


logo