PM Modi | ‘నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోంది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై ప్రధాని తాజాగా స్పందించారు. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి మన బలగాలు 22 నిమిషాల్లోనే బదులిచ్చాయని తెలిపారు. పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాయని వ్యాఖ్యానించారు. గుజరాత్ బికనీర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు.
‘ఆపరేషన్ సిందూర్’లో ఉగ్రవాదుల ఏరివేతకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో దేశ ప్రజలంతా గర్వపడుతున్నారని చెప్పారు. చక్రవ్యూహాలతో త్రివిధ దళాలు ప్రత్యర్థి పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయన్నారు. మన మహిళల సిందూరం చెరిపిన వారిని మట్టిలో కలిపేసినట్లు చెప్పారు. ‘ఏప్రిల్ 22న జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా చేపట్టాం. సిందూరం భగ్గుమంటే దాని ఫలితం ఎలా ఉంటుందో అందరూ చూశారు. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల తొమ్మిది అతిపెద్ద రహస్య స్థావరాలను 22 నిమిషాల్లోనే ధ్వంసం చేశాం. చక్రవ్యూహాలతో త్రివిధ దళాలు ప్రత్యర్థి పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మన మహిళల సిందూరం చెరిపిన వారిని మట్టిలో కలిపేశాయి. మన సాయుధ దళాలు పాక్‌ను మోకరిల్లేలా చేశాయి’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ఈ సందర్భంగా పాక్, ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరికలు చేశారు. పాక్ అణుబెదిరింపులకు భారత్ ఇక ఏమాత్రం భయపడదని అన్నారు. పాక్‌తో ఎలాంటి వాణిజ్యం, చర్చలు ఉండవని స్పష్టం చేశారు. చర్చల మాట అంటూ వస్తే.. అది పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే అని తేల్చి చెప్పారు. ఉగ్రవాదులకు ఇకపై ఇలాంటి సమాధానమే ఉంటుందని హెచ్చరించారు. భారత ప్రజల జోలికొస్తే.. గట్టి గుణపాఠం తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
Also Read..
S Jaishankar | అమెరికా.. అమెరికాలోనే ఉంది.. పాక్‌తో సంధి విషయంలో యూఎస్ పాత్రపై జైశంకర్ క్లారిటీ
S Jaishankar | పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌పై జైశంకర్ సంచలన ఆరోపణలు