S Jaishankar | భారత్-పాకిస్థాన్ మధ్య సంధికి మధ్యవర్తిత్వం విషయంలో అమెరికా పాత్రపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ (S Jaishankar) తాజాగా స్పందించారు. కాల్పుల విరమణపై రెండు దేశాలు నేరుగా చర్చలు జరిపాయన్నారు. మే 10న జరిగిన అవగాహన ఒప్పందం న్యూఢిల్లీ-ఇస్లామాబాద్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమని స్పష్టం చేశారు. రెండు దేశాల ప్రతినిధులు హాట్‌లైన్ ద్వారా చర్చించినట్లు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.
కాగా, భారత్-పాక్ అణుయుద్ధాన్ని ఆపానని, కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి తానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) తొలి నుంచీ ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య సంధి తన ఘనతే అని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియలో అమెరికా పాత్రపై జైశంకర్‌కు ప్రశ్న ఎదురైంది. ‘ఈ ప్రక్రియలో అమెరికా ఎక్కడ ఉంది..? అని జైశంకర్‌ను ప్రశ్నించగా.. ‘అమెరికా.. అమెరికాలోనే ఉంది’ అంటూ సూటిగా బదులిచ్చారు. ఉద్రిక్తల సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీతో మాట్లాడినట్లు చెప్పారు. ఆ దేశ విదేశాంగ మంత్రి తనతో ఫోన్లో సంభాషించినట్లు చెప్పారు. అమెరికానే కాకుండా పశ్చిమాసియా, ఇతర దేశాల నాయకులు కూడా ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో భారత్‌ను సంప్రదించినట్లు జైశంకర్ చెప్పుకొచ్చారు.
ఏవైనా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు.. ఇతర దేశాలు సంప్రదింపులు జరపడం సహజమే అని పేర్కొన్నారు. మే 10న జరిగిన అవగాహన ఒప్పందం న్యూఢిల్లీ-ఇస్లామాబాద్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు.. ప్రపంచంలోని ఇతర దేశాలు సంప్రదించి తమ ఆందోళనను తెలియజేయడం సహజం. కానీ, కాల్పుల విరమణ, సైనిక చర్యలను నిలిపివేయడం అనేది పూర్తిగా భారత్-పాక్ మధ్య నేరుగా జరిగిన చర్చల ఫలితం. మే 10న పాక్ ఆర్మీ నుంచి మాకు ఒక సందేశం వచ్చింది. ఫైరింగ్ ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నామని దాని సారాంశం. దీనిపై రెండు దేశాల ప్రతినిధులు హాట్‌లైన్ ద్వారా చర్చలు జరిపారు’ అని జైశంకర్ స్పష్టం చేశారు.
Also Read..
Encounter | జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
IndiGo | గగనతలంలో భారీ కుదుపులకు లోనైన విమానం.. వీడియో వైరల్