శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వర్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. గురువారం ఉదయం కిష్ట్వర్ జిల్లాలోని సింగ్‌పొరా చత్రూ ప్రాంతంలో భద్రతా బలగాలు, అస్సాం రైఫిల్స్, కిష్ట్వర్ స్పెషల్ పార్టీ పోలీసులు సంయుక్తంగా ఛట్రూ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ముగ్గురు నలుగురు ఉగ్రవాదులను చట్టుముట్టాయి. దీంతో ఇరుపక్షాల మధ్య ఉదయం 7 గంటల నుంచి హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు టెర్రరిస్టులను అంతమొందించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించింది. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపాయి. దీనికి సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉన్నది.
గత రెండు వారాల్లో జమ్ముకశ్మీర్‌లో ఎనిమిది మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామాలో గతవారం ముగ్గురు జైషే మహమ్మద్ టెర్రరిస్టులను ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసేంది. కాగా, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగి గురువారానికి నెల రోజులు పూర్తయింది. ఏప్రిల్ 22న జరిగిన ఈ దాడిలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చిచంపిన విషయం తెలిసిందే.