బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 18:07:40

అస్సాం వరదలు : లక్ష హెక్టార్లకు పైగా పంటనష్టం

అస్సాం వరదలు : లక్ష హెక్టార్లకు పైగా పంటనష్టం

గౌహతి : అస్సాం రాష్ట్రంలో వరదలు విలయం సృష్టించాయి. పలు గ్రామాలు నీట మునగడంతో ప్రాణ, ఆస్తినష్టం భారీగా సంభవించింది. బ్రహ్మపుత్రా నదికి వరద పోటెత్తడంతో కాజీరంగా జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 80 శాతం నీట మునిగి మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. వరద చుట్టుముట్టడంతో వన్యప్రాణులు జాతీయ రహదారిపైకి వచ్చి ప్రాణాలు నిలుపుకుంటున్నాయి. ఇప్పటి వరకూ 129 వరకు జంతువులు చనిపోయాయని ప్రభుత్వం తెలిపింది.

14 ఖడ్గమృగాలు, 5 అడవి గేదెలు, 8 అడవి పందులు, 2 చిత్తడి జింకలు, 95 హాగ్ జింకలు, ఓ సాంబార్, 3 పందికొక్కులు, కొండ చిలువను రక్షించినట్లు పార్కు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 30 జిల్లాలను వరదలు ముంచెత్తడంతో 2,543 గ్రామాల్లో 1,22,573.16 హెక్టార్ల పంట నష్టం సంభవించగా 96 మందికిపైగా మృతి చెందినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎస్‌డీఎంఏ) తెలిపింది. బ్రహ్మపుత్ర నది పరివాహాక ప్రాంతాల్లో 50,136 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాధితుల కోసం 49 496 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది అస్సాంలో వరదలు సంభవించడం ఇది నాలుగోసారి.


logo