Asim Munir : ఆపరేషన్ సిందూర్ (Operation Sindhoor) తర్వాత పోయిన పరువును తిరిగి దక్కించుకునేందుకు పాకిస్థాన్ నేతలు, ఆర్మీ ఉన్నతాధికారులు నోటికొచ్చిన ప్రేలాపనలు చేస్తున్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ (Pak Army Chief) అసిమ్ మునీర్ (Asim Munir) తమ దేశాన్ని డంపర్ ట్రక్కు (Dumper truck) తో పోల్చాడు. భారత్‌ను మెర్సిడెజ్ బెంజ్ అన్నాడు. రెండు ఢీకొట్టుకుంటే ఏమవుతుందో మీరే ఊహించుకోండి అంటూ తలబిరుసు వ్యాఖ్యలు చేశాడు.
మూడు నెలల క్రితం సౌదీ ప్రతినిధుల బృందం సమక్షంలో అసిమ మునీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని తాజాగా పాకిస్థాన్ ఇంటీరియర్ మినిస్టర్ మొహసిన్ నఖ్వీ వెల్లడించారు. ఆ సమయంలో మునీర్ మాటలు విని సౌదీ బృందం మౌనంగా ఉండిపోయిందని తెలిపారు. కాగా సౌదీకి చెందిన ఓ ప్రతినిధుల బృందం మే నెల మధ్యలో పాకిస్థాన్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా వారు భారత్‌తో ఘర్షణ విషయంలో ఇస్లామాబాద్‌కు సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు.
దాంతో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కలుగజేసుకుని.. ‘భారత్ ఓ మెరుస్తున్న మెర్సిడెస్ బెంజ్ లాంటిది. కానీ మేం రాళ్లతో నిండిన డంపర్ ట్రక్కు లాంటి వాళ్లం. రెండూ ఢీకొంటే ఏమవుతుందో వూహించుకోండి’ అని వ్యాఖానించాడు. అంటే ట్రక్కు ఢీకొంటే కారు నుజ్జునుజ్జు అవుతుంది అనే ఉద్దేశంలో మునీర్ ఈ ప్రేలాపన చేశాడు. ఆ సమయంలో సౌదీ ప్రతినిధుల బృందం మౌనంగా ఉండిపోయింది. ఈ విషయాన్ని లాహోర్‌లో జరిగిన ఓ సెమినార్లో పాక్ మంత్రి నఖ్వీ వెల్లడించారు.
ఇదే మంత్రి ఆపరేషన్ సిందూర్ సమయంలో మాట్లాడుతూ.. ఒక్క భారత క్షిపణి కూడా తమ దేశ భూభాగాన్ని తాకలేదని పచ్చి అబద్ధం చెప్పారు. ఇదిలావుంటే ఇటీవల అమెరికాలోని టంపాలో జరిగిన ఓ ప్రైవేటు విందులో కూడా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ డంపర్ ట్రక్కు వ్యాఖ్యలు చేశాడు. అయితే మునీర్ సొంత దేశాన్ని డంపర్ ట్రక్కుతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నవ్వులపాలయ్యాయి.