Supreme Court : శిక్షణ సమయంలో దివ్యాంగులై కోలుకున్న క్యాడెట్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం (Union government), భద్రతా దళాలు (Security forces) తమ స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. వారిని డెస్క్ జాబ్ లేక రక్షణ సేవలకు సంబంధించిన ఇతర విధుల్లోకి తీసుకునేలా ఏదైనా పథకాన్ని తీసుకువచ్చే యోచన చేయాలని చెప్పింది.
వివిధ సైనిక సంస్థల్లోని క్యాడెట్ల పరిస్థితలను అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుని విచారణ జరిపింది. వారికి మరణం, వైకల్యం వంటివి సంభవిస్తే బీమా రక్షణ కల్పించే అంశాన్ని పరిశీలించాలని, ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని కూడా పెంచాలని పేర్కొంది. గతంలో ఉన్నతస్థాయి సైనిక సంస్థలైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలిటరీ అకాడమీ లాంటి వాటిల్లో శిక్షణ పొందిన క్యాడెట్ల సమస్యలపై వచ్చిన మీడియా కథనం ఆధారంగా ఈ విచారణ జరిగింది.
ఆ మీడియా కథనం ప్రకారం.. 1985 నుంచి వైద్యపరమైన కారణాలతో 500 మంది క్యాడెట్లు విధులకు దూరమయ్యారు. వారికి వస్తున్న ఎక్స్‌గ్రేషియాకు, ఖర్చుపెడుతున్న వైద్య బిల్లులకు పొంతన లేదు. దాంతో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని విచారిస్తోంది.