Asia Cup 2025 : ఆసియా కప్ స్క్వాడ్ ఎంపిక కోసం సెలక్టర్లు మంగళవారం ముంబైలో సమావేశం కానున్నారు. నేను అందుబాటులో ఉంటానని చెప్పడంతో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) స్క్వాడ్‌లో ఉండడం దాదాపు ఖామమనిపిస్తోంది. బౌలింగ్ యూనిట్‌కు పెద్దన్నలా వ్యవహరించే బుమ్రా టీమ్‌లో ఉంటే ఆ ధైర్యమే వేరు. కానీ, వర్క్‌లోడ్ కారణంగా కొంత కాలంగా కొన్ని మ్యాచ్‌లే ఆడుతున్న ఈ యార్కర్ కింగ్ ఆసియా కప్‌లో గాయపడితే పరిస్థితి ఏంటీ?.. మరికొన్ని రోజులు అతడు జట్టుకు దూరం అవుతాడు కదా? అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లో భారత్‌కు బుమ్రా చాలా కీలకం. త్వరలో స్వదేశంలో వెస్టిండీస్ (West Indies), దక్షిణాఫ్రికా (South Africa)తో జరిగే సిరీస్‌లకు అతడు ఫిట్‌గా, ఫామ్‌తో ఉండడం చాలా ముఖ్యం. అందుకనే ఆసియా కప్‌లో బుమ్రాను ఆడించడం రిస్క్ అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. నిరుడు పొట్టి వరల్డ్ కప్ ఛాంపియన్లుగా నిలిచిన భారత్.. బుమ్రా గైర్హాజరీలోనే 20 మ్యాచ్‌లు ఆడింది. అందులో ఏకంగా 17 విజయాలతో అదరగొట్టింది.
It’s been 14 months since Jasprit Bumrah last featured in a white-ball game for India. 🇮🇳👀#AsiaCup #JaspritBumrah #Cricket #Sportskeeda pic.twitter.com/2lj7ClQyXs
— Sportskeeda (@Sportskeeda) August 17, 2025
పొట్టి ఫార్మాట్ జట్టులో బుమ్రా లేకున్న భారత బౌలింగ్ పస తగ్గలేదు. యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh), అవేశ్ ఖాన్, హర్షిత్ రానా అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టుకు విజయాలు కట్టబెట్టారు. ఐపీఎల్ 18వ సీజన్లో అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్న ప్రసిధ్ కృష్ణ కూడా నిలకడగా రాణిస్తున్నాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు. అందుకే.. బుమ్రా లేకున్నా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) గడ్డపై టీమిండియా చెలరేగుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఇంగ్లండ్ పర్యటనలో మూడే టెస్టులు ఆడిన బుమ్రా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అక్టోబర్ – నవంబర్‌లో భారత జట్టు సొంతగడ్డపై వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడనుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న టీమిండియాకు ఈ రెండు సిరీస్‌లో విజయం సాధిస్తే టాప్‌లోకి దూసుకెళ్లే అవకాశముంది. సో.. కచ్చితంగా బుమ్రా ఆడితే శుభ్‌మన్ గిల్ సేన ప్రత్యర్థుల భరతం పట్టడం ఖాయం. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానుంది.