Arvind Kejriwal | ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వారం రోజుల్లోనే తన అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నట్లు (vacate Delhi chief ministers residence) ఆప్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. దీంతోపాటు అన్ని ప్రభుత్వ సౌకర్యాలను కూడా వదులుకుంటారని తెలిపాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వదులుకోవాలని కేజ్రీ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికార నివాసాన్ని వీడిన తర్వాత కేజ్రీ, ఆయన కుటుంబం ఢిల్లీలోనే ఉంటారని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ (MP Sanjay Singh) తెలిపారు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలతోనే ఉంటారని.. వారు ఉండేందుకు తగిన వసతి కోసం అన్వేషణ జరుగుతోందని చెప్పారు. ‘అరవింద్ కేజ్రీవాల్ వారం రోజుల్లో తన అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తారు. మేము కేజ్రీ భద్రత గురించి ఆందోళన చెందుతున్నాము. ఇప్పుడు ఉన్న ఇల్లు ఆయన భద్రతకు చాలా ముఖ్యమైనది. కానీ ఆయన దాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు’ అని సంజయ్ సింగ్ అన్నారు.
అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాపై ఢిల్లీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘కేజ్రీవాల్ రాజీనామాపై ఢిల్లీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అవినీతి పరుడని బీజేపీ ఆరోపిస్తోంది. ఆయన నిజాయితీని ప్రశ్నిస్తూ గత రెండేళ్లుగా కేజ్రీ పరువు తీసేందుకు ప్రయత్నిస్తోంది. మద్యం కేసులో బెయిల్ రావడం దాదాపు అసాధ్యం అనుకున్న సమయంలో.. కేజ్రీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది’ అని సంజయ్ సింగ్ పేర్కొన్నారు.
Also Read..
Gautam Gambhir: ప్రపంచ మేటి బౌలర్ బుమ్రా.. గేమ్‌ను ఎప్పుడైనా మార్చేస్తాడు : గౌతం గంభీర్
Udhayanidhi Stalin | రానున్న 24 గంటల్లో డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టనున్న ఉదయనిధి స్టాలిన్..!
Kamala Harris | ట్రంప్‌నకు కమలా హారిస్ ఫోన్ కాల్