చెన్నై: ఇండియన్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు కొత్త కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir). గురువారం నుంచి చెన్నైలో బంగ్లాదేశ్తో తొలి టెస్టు జరగనున్నది. ఈ నేపథ్యంలో ఇవాళ అతను ప్రెస్కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ జట్టును గౌరవిస్తామని, కానీ తాము ఓ చాంపియన్ తరహాలో ఆడనున్నట్లు గంభీర్ తెలిపారు. ఒకప్పుడు టీమిండియా అంటే కేవలం బ్యాటింగ్ మాత్రమే బలంగా ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నాడు. బుమ్రా, అశ్విన్, షమీ, జడేజా లాంటి బౌలర్లు జట్టుకు కీలకంగా మారినట్లు వెల్లడించారు.
పేస్ బౌలర్ బుమ్రా ప్రపంంలోనే అత్యుత్తమ బౌలర్ అని, ఏ క్షణమైనా అతను మ్యాచ్ను మార్చేస్తాడని గంభీర్ తెలిపాడు. క్రికెటర్లు కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడటానికి ఇష్టపడుతారని కొందరంటుంటారని, కానీ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ దేశం కోసం ఆడేందుకు ఇష్టపడుతారని గంభీర్ చెప్పాడు.
భారత జట్టు బ్యాటింగ్ బృందం బలంగా ఉన్నదని, చాలా నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారని, ఎటువంటి స్పిన్ బౌలర్లనైనా ఎదుర్కొంటారని గంభీర్ పేర్కొన్నాడు.