Kamala Harris | అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris).. తన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు ఫోన్ చేశారు. ఇటీవలే ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడిని ఫోన్ ద్వారా కమలా హారిస్ (Kamala Harris Dials Trump) పరామర్శించారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన క్షేమంగా ఉండటంపై ఉపాధ్యక్షురాలు సంతోషం వ్యక్తం చేసినట్లు అధ్యక్ష భవనం వెల్లడించింది. మరోవైపు ఈ ఫోన్ కాల్‌పై ట్రంప్ స్పందించారు. తనకు ఓ మంచి ఫోన్ కాల్ వచ్చిందంటూ వ్యాఖ్యానించారు.
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఒకసారి ఆయనపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఆయన గోల్ఫ్ ఆడుతుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపేందుకు విఫలయత్నం చేశాడు. ఆదివారం ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ వద్ద ఉన్న ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది.
రక్షణ కంచె వద్ద నుంచి దుండగుడు ట్రంప్ లక్ష్యంగా ఏకే-47 తుపాకీ గురిపెట్టాడు. ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దుండగుడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు కారులో పారిపోగా, ఏజెంట్లు వెంబడించి అరెస్టు చేశారు. ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం రెండు నెలల్లో ఇది రెండోసారి. జూలైలో పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు ట్రంప్‌పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత గత నెల 30న పెన్సిల్వేనియా (Pennsylvania)లోని జాన్స్టౌన్ (Johnstown)లో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ దుండగుడు వేదికవైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ స్టేజ్‌పై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఓ దుండగుడు వేగంగా స్టేజ్ వైపు దూసుకొచ్చాడు. దాదాపు మీడియా పాయింట్ వరకూ వచ్చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.
Also Read..
building collapses | ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
Pagers Explosion: పేజర్లతో పేలుళ్లు.. వీడియోలు వైరల్
UI The Movie | మేకింగ్‌లో హిస్టరీ.. స్టన్నింగ్‌గా ఉపేంద్ర యూఐ లుక్