Strait of Hormuz : హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) విషయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి (Iran Foreign Minister) అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకే జలసంధిని మూసివేశామని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇతర దేశాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చన్నారు. అయితే భద్రతా సమస్యల కారణంగా అనేక దేశాలు ముందుకు రావడంలేదని చెప్పారు.
ప్రస్తుతం హర్మూజ్ జలసంధి మీదుగా అనేక చమురు ట్యాంకర్లు, నౌకలు ప్రయాణిస్తున్నాయని ఇరాన్ మంత్రి తెలిపారు. హర్మూజ్‌లో కృత్రిమ అడ్డంకుల కారణంగా చైనా, ఫ్రాన్స్, జపాన్ తదితర దేశాలు ఇబ్బంది పడుతున్నాయని, త్వరలో ఈ ప్రాంతానికి అవి తమ యుద్ధ నౌకలను పంపనున్నాయని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో.. అరాగ్చీ ఈ వ్యాఖ్యలు చేశారు. నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఇటీవలి దాడుల్లో గాయపడ్డారని అమెరికా చేస్తున్న వాదనలపైనా స్పందిస్తూ.. ఆయనకు ఎటువంటి సమస్యా లేదని తెలిపారు.
రాజ్యాంగం ప్రకారం మొజ్తాబా తన విధులను నిర్వర్తిస్తున్నారని ఇరాన్ మంత్రి చెప్పారు. తమ దేశం పటిష్ఠ స్థితిలో ఉందని, ఏ ఒక్క వ్యక్తిపైనా ఆధారపడి లేదని చెప్పారు. ఒకవేళ కీలక వ్యక్తులకు ప్రాణనష్టం సంభవించినా తట్టుకోగలదని చెప్పారు. పరిస్థితి అంతా అదుపులోనే ఉందన్నారు. గత నెలలో జెనీవాలో జరిగిన చర్చల సందర్భంగా.. అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, కుష్నర్లపై తాను గట్టిగా అరిచానని, ఇరాన్ వద్ద 11 అణుబాంబులకు సరిపడా యురేనియం ఉందని బెదిరించానని వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. చర్చలకు సంబంధించిన వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.