Loksabha Elections 2024 : కాంగ్రెస్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పొత్తు శాశ్వతం కాదని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే లక్ష్యంతోనే ఇరు పార్టీలు కలిసి ముందుకొచ్చాయని చెప్పారు. కేజ్రీవాల్ ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. జూన్ 4న అనూహ్య ఫలితాలు వెలువడతాయని, లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌తో తమది శాశ్వత వివాహం కాదని, బీజేపీని ఓడించడమే తమ ప్రస్తుత లక్ష్యమని, నియంతృత్వ కాషాయ సర్కార్‌ను కూలదోయడమే తమ ప్రాధాన్యతాంశమని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నా పొరుగున పంజాబ్‌లో మాత్రం ఇరు పార్టీలూ పరస్పరం తలపడుతున్నాయి. దేశాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌తో కలిసిసాగక తప్పదని చెప్పారు. లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన క్రమంలో సీఎం పదవి నుంచి వైదొలగుతారా అని ప్రశ్నించగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు.
తనను వారు ఎంతకాలం జైల్లో ఉంచుతారో చూద్దామని, కానీ తాను మాత్రం కాషాయ పాలకుల ముందు తలవంచనని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా జూన్ 2న జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. ఇక ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వేధింపుల కేసుపై వ్యాఖ్యానించేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ రాజకీయ కెరీర్‌కు ప్రధాని మోదీ చరమగీతం పాడతారని పేర్కొన్నారు.
Read More :
Bengaluru Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. హేమకు మరోసారి నోటీసులు