నిత్య వ్యాయామంతో మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుందని శాన్ ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు అంటున్నారు. తాజాగా, ఎలుకలపై వీరు చేసిన ఓ అధ్యయనంలో.. కీలకమైన జీవ ప్రక్రియను కనుగొన్నారు. మెదడు ఆరోగ్యాన్ని వ్యాయామం ఎలా మెరుగుపరుస్తుందనే విషయాన్ని బయటపెట్టారు. ఈ అధ్యయనంలో భాగంగా, కొన్ని ఎలుకలతో క్రమంతప్పకుండా వ్యాయామం చేయించారు. ఈ సందర్భంగా వాటి కాలేయం జీపీఎల్‌డీ1 అనే ఎంజైమ్‌ను రక్తంలోకి విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
సాధారణంగా రక్తం నుంచి మెదడులోకి వెళ్లే పదార్థాలను ‘బ్లడ్-బ్రెయిన్ బారియర్’ అడ్డుకుంటుంది. అయితే, ఈ జీపీఎల్‌డీ1 ఎంజైమ్ నేరుగా మెదడులోకి వెళ్లదు. బదులుగా, రక్తంలోని ఇతర ప్రొటీన్లను విచ్ఛిన్నం చేయడం ద్వారా మెదడులో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. కొత్త నాడుల పెరుగుదలకు సహకరిస్తుంది. అంటే.. కాలేయం పంపే సంకేతాలు మెదడు పనితీరును నియంత్రిస్తాయని ఈ సందర్భంగా పరిశోధకులు వెల్లడించారు. వ్యాయామం వల్ల పెరిగే ఈ ఎంజైమ్ స్థాయులు.. మెదడులోని జ్ఞాపకశక్తికి కేంద్రమైన హిప్పోకాంపస్‌లో కొత్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయట.
దీనివల్ల ఆలోచనా విధానంలో స్పష్టత వస్తుందనీ, విషయాలను త్వరగా గుర్తుంచుకునే సామర్థ్యం పెరుగుతుందనీ వారు చెబుతున్నారు. అంతేకాకుండా.. వయసుతోపాటు వచ్చే మతిమరుపు కూడా తగ్గుతుందని అంటున్నారు. వయస్సు పెరిగే కొద్దీ మెదడు ఎలా క్షీణిస్తుందో అర్థం చేసుకోవడానికి కూడా ఈ ఆవిష్కరణ ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వ్యాయామం చేయని ఎలుకల్లోకి ఈ ఎంజైమ్‌ను కృత్రిమంగా ఎక్కించారు. అప్పుడు అవి కూడా వ్యాయామం చేసిన ఎలుకల్లాగే మెరుగైన జ్ఞాపకశక్తిని, నేర్చుకునే సామర్థ్యాన్ని ప్రదర్శించాయట. దాంతో, ఈ ఆవిష్కరణ అల్జీమర్స్ వ్యాధికి కొత్త చికిత్సలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.