ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు శుక్రవారంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా సీసీఐ కేంద్రాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. శనివారం నుంచి ప్రైవేట్ వ్యాపారులకే విక్రయించాల్సి వస్తుందని, వారు నిర్ణయించిదే ధర అని, తాము తీవ్రంగా నష్టపోతామని పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆదిలాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో అక్టోబర్ చివరివారంలో పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన సీసీఐ 11 కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి పంటను మద్దతు ధరతో క్వింటాల్‌కు రూ.8010తో సేకరించింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ వ్యాపారులు, సీసీఐ ఆధ్వర్యంలో 16,04,094 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ప్రైవేట్ వ్యాపారులు 49,562 క్వింటాళ్లు కొనగా, సీసీఐ ఆధ్వర్యంలో 15,54,532 క్వింటాళ్ల పత్తిని సేకరించారు. గతేడాది పోల్చితే ఈ సారి 8.51 లక్షల క్వింటాళ్ల పత్తి తక్కువగా విక్రయానికి వచ్చింది. గతేడాది 115908 మంది రైతులు పత్తిని విక్రయించగా ఈ సంవత్సరం 102752 మంది రైతులు పత్తిని విక్రయించారు. ప్రస్తుతం రోజు 250 నుంచి 300 వాహనాల్లో రైతులు పత్తిని తీసుకొని వస్తున్నారు. నాలుగు వేల క్వింటాళ్ల వరకు పంట విక్రయానికి వస్తున్నది. రైతులు పత్తిని సీసీఐ కేంద్రాలకు ఎక్కువగా తీసుకువస్తున్నప్పటికీ ఈ నెల 28 నుంచి కొనుగోలు కేంద్రాలను మూసివేయడంతో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
ఇక ప్రైవేట్‌లోనే విక్రయాలు
కేంద్రం ఈ ఏడాది పత్తికి క్వింటాకు రూ.8110 మద్దతు ధర ప్రకటించగా పత్తిలో దూదిపింజ సరిగా రావడం లేదంటూ సీసీఐ అధికారులు రూ.100 తగ్గించి పంటను కొనుగోలు చేశారు. దీంతో రైతులకు మద్దతు ధర లభించలేదు. జిల్లాలో వానకాలంలో కురిసిన వర్షాల కారణంగా రైతులు పంటను నష్టపోయారు. పత్తి ధర పెరుగుతుందనే ఆశతో రైతులు తమ చేన్లలో పత్తిని తీయకుండా ఉంచారు. తీరా సీసీఐ కేంద్రాలు మూసివేయడంతో వారు ప్రైవేట్ వ్యాపారులకే పత్తిని విక్రయించుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఏటా జిల్లాలో మార్చి చివరి వారం వరకు పత్తి కొనుగోలు జరుగుతాయి. ఈ సంవత్సరం సీసీఐ అధికారులు నెల రోజుల ముందుగానే కొనుగోళ్లను నిలిపివేశారు. సీసీఐ కొనుగోళ్లు లేకపోవడంతో ప్రైవేట్‌లో వ్యాపారుల నిర్ణయించిన ధరకు రైతులు పంటను విక్రయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రైవేట్‌లో క్వింటాకు రూ.7 వేలు ధర ఉండగా పంట నాణ్యత, ఇతర కారణాలు చూపుతూ వ్యాపారులు రూ.6500తో కొనుగోలు చేసే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. దీంతో తాము క్వింటాకు రూ. 1500 నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు.