Army Chief | జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్లో ఉగ్రదాడితో (Pahalgam Terror Attack) భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడిపై గుర్రుగా ఉన్న భారత్.. పాక్‌పై ముప్పేట దాడికి దిగింది. ఆ దేశంపై అనేక ఆంక్షలు విధించింది. ఉగ్రమూకలకు ఆశ్రయమిస్తున్న పాకిస్థాన్‌కు అందిస్తున్న అన్ని రకాల వీసా సేవలను నిలిపేసింది. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.
పాకిస్థాన్‌కు చెందిన ఎక్స్ ఖాతాలను నిలిపేసింది. ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఉద్రిక్తతల వేళ నేడు భారత ఆర్మీ చీఫ్ జనరల్ (Army Chief General) ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) జమ్ము కశ్మీర్‌కు వెళ్లనున్నారు. శ్రీనగర్, ఉదమ్‌పూర్‌లో పర్యటించనున్నారు. కశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన భేటీ కానున్నారు. ఎల్వోసీ వద్ద ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీయనున్నారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ద్వివేది వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
మరోవైపు కుక్కతోక వంకర అన్నట్లు పాకిస్థాన్ వక్రబుద్ధి (Pak opens Firing) మారడం లేదు. నేడు ఆర్మీ చీఫ్ విజిట్ వేళ జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిచిన పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి (LOC) పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి భారత బలగాలపైకి కాల్పులు జరిపారు. అయితే శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటున్నది. పాక్ సైన్యం కాల్పులకు దీటుగా బదులిస్తున్నది. తాజా పరిణామాల వేళ ఆర్మీ చీఫ్ పర్యటన ఆసక్తికరంగా మారింది. పాక్ విషయంలో భారత్ తదుపరి చర్యలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Also Read..
Pahalgam Attack | పెహల్గామ్ దాడి.. ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన ఆర్మీ