న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. పెహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. బెంగుళూరులో గురువారం ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో ఆయన మాట్లాడుతూ కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. భారతీయులపై ఆ ఘటన తీవ్ర ప్రభావం చూపిందన్నారు. దాడికి పాల్పడిన కుట్రదారుల్నిఓ ప్రశ్న అడగాలనుకుంటున్నానని, ఉగ్రవాదులకు ఊతం ఇస్తున్న వారిని కూడా ఓ ప్రశ్న వేయాలనుకుంటున్నానని, ఈ ఫైటింగ్‌తో ఏం సాధించామని, గత 78 ఏళ్లలో ఒక్క ఇంచు భూమి కూడా మారలేదని, అంటే రాబోయే 78 వేల ఏళ్లకు కూడా ఎటువంటి మార్పు ఉండబోదని , మరి అలాంటప్పుడు శాంతియుతంగా ఎందుకు జీవించడం లేదని గవాస్కర్ ప్రశ్నించారు. దేశాన్ని ఎందుకు బలోపేతం చేయడం లేదని అడగారు. స్టార్ స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పెహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మృతిచెందారు. దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్నది. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీన్ని పాకిస్థాన్ సిరీయస్‌గా తీసుకుని.. దౌత్య సంబంధాలను బ్రేక్ చేసింది.