శ్రీనగర్: మతం ఆధారంగా కొందరు ముష్కరులు పహల్గాంలో నరమేధానికి దిగగా, మతం కన్నా మానవత్వమే ముందుండాలని నిరూపించారు స్థానికులు. ‘మా జీనవాధారానికి కారణమైన వారిని అలా చూసి కన్నీళ్లు ఆగలేదు. అందుకే మా ప్రాణాలు ఏమైనా పర్వాలేదనుకుని గాయపడ్డ వారిని రక్షించిడానికి ప్రయత్నించాం’ అని స్థానిక శాలువాల వ్యాపారి సాజద్ అహ్మద్ భట్ పేర్కొన్నారు. గాయపడ్డ వారిని వీపుపై ఎక్కించుకుని దవాఖానకు తరలించి మతం కంటే మానవత్వం ముఖ్యమని నిరూపించారు.
బైసరాన్లో పర్యాటకులను రక్షించడానికి అవసరమైన సహాయం అందించాలంటూ పోనీ అసోసియేషన్ అధ్యక్షుడు పెట్టిన మెసేజ్ చూసి వెంటనే అక్కడకు చేరుకున్నానన్నారు. గాయపడ్డ వారికి మంచినీరు అందించి గాయపడి, నడవలేని స్థితిలో ఉన్న వారిని వీపుపై ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకువచ్చినట్టు భట్ తెలిపారు. ‘మతం కన్నా మానవత్వం ముందు వస్తుంది. పర్యాటకులు మా అతిథులు. వారిని గౌరవించడం మా ధర్మం. మా జీవనాధారం వారే. గాయపడిన చాలామందిని దవాఖానకు తీసుకుని వచ్చాం’ అని తెలిపారు.
Terror Attack | న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం కనీసం ఐదుగురు సభ్యులతో కూడిన ముష్కర మూక ఈ దారుణంలో పాలుపంచుకుంది. గడ్డిమైదానాన్ని ఆనుకుని ఉన్న దేవదారు చెట్లతో ఉండే అటవీ ప్రాంతం నుంచి ముందు నిర్దేశించుకున్న విధంగా పర్యాటకులు అధిక సంఖ్యలో ఉండే మూడు ప్రాంతాలకు ముష్కరులు చేరుకున్నారు. వీరివద్ద రైఫిళ్లతో పాటు జరిగిన దృశ్యాలను రికార్డు చేయడానికి బాడీ కెమెరాలు కూడా ఉన్నాయి. మధ్యాహ్నం 1.50 గంటలకు మొదటి ఫైరింగ్ చోటుచేసుకుంది.
ఒక్కసారిగా ఉగ్రవాదుల కాల్పులు జరగడంతో పర్యాటకులు భీతావహులయ్యారు. వారు ఒక్కో పర్యాటకుడి వద్దకు వెళ్లి వారి మతాన్ని అడిగి, వారికి ఇస్లామిక్ పద్య పరీక్ష నిర్వహించి నిర్ధారించుకున్న తర్వాతే కాల్చి చంపారు. 10 నిమిషాల పాటు ఈ నరమేధం సాగింది. తర్వాత వారు వచ్చిన దారిలోనే అటవీ మార్గం గుండా పారిపోయారు. ఈ దాడి జరిగిన సుమారు అరగంట తర్వాత 2.30 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. అయితే అక్కడకు చేరుకోవడానికి వాహన మార్గం లేకపోవడంతో కాలినడకన, లేదా గుర్రాలపై అక్కడికి చేరుకోవాలి. దీంతో పోలీసులు ఘటనా స్థలికి మూడు దాటిన తర్వాతే చేరుకున్నారు. కాల్పులకు గురైనవారు కొంత సేపు ఊపిరితోనే ఉన్నారని, అత్యవసర చికిత్స అంది ఉంటే కొందరైనా బతికి ఉండేవారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.