‘స్వర్గం బహుశా గ్రంథాలయంలాగే ఉంటుందేమో’ అని ఊహించాడు అర్జెంటీనా రచయిత జార్జ్ లూయిస్ బోర్గెస్. నచ్చిన పుస్తకం చేతిలో పడ్డాక అక్షరాల్లో మునిగిపోతే సమయం తెలియకుండా గడిచిపోతుంది. భౌతిక ప్రపంచాన్ని మరచిపోయి జ్ఞాన ప్రపంచంలో విహరింపజేసే గ్రంథాలయాన్ని స్వర్గం కన్నా మిన్న అనడంలో అతిశయోక్తి లేదు! ఆ ఊహల స్వర్గాన్ని భూతల మార్గం పట్టించిన మరో పుస్తక ప్రపంచం కొఫోర్జ్ పౌర గ్రంథాలయం!
‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో..
ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అన్నాడు
కందుకూరి వీరేశలింగం పంతులు. చిరిగిన చొక్కా తొడగడం ఫ్యాషన్ అయిన కాలంలో నేటి తరం మంచి పుస్తకాల సంగతే మరచిపోయింది. మనుషులే కాదు సమాజమూ పుస్తకానికి దూరమైపోతున్నది. వస్తు ఉత్పత్తి, వినిమయం, సేవలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం, నేరాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. తరుగుతున్నది ఏమైనా ఉందా అంటే.. అది పుస్తక పఠనమే. ఈ మధ్య పుస్తకాల జాతరకు వస్తున్నవాళ్లే కాదు, పుస్తకాలు కొంటున్నవాళ్లు పెరిగినట్టే పుస్తకాల వ్యాపారం కూడా పెరుగుతున్నదని లెక్కలు తేల్చాయి. కానీ, గ్రంథాలయాలకు వెళ్తే ఖాళీ కుర్చీలే కనిపిస్తుంటాయి.
పుస్తకాల అమ్మకాలు పెరిగినట్లుగా పుస్తక పఠనానికి ఆదరణ పెరగలేదు. ఇందులో మార్పు కోసం పుస్తకాల నడక, యాత్రలు మన తెలంగాణలో జరుగుతున్నాయి. పుస్తక ప్రేమికులకు ఉత్సాహం, చదువరులకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు కొఫోర్జ్ కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యతతో ఒక పౌర గ్రంథాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. హైటెక్ సిటీలో ఉన్న కొఫోర్జ్ పబ్లిక్ లైబ్రరీ ఈ తరం ఇష్టపడేలా ఇంటీరియరే కాదు కొత్త కొత్త పుస్తకాలెన్నో అందుబాటులోకి తెచ్చింది. పెద్దలకు కావాల్సిన ప్రాచీన సాహిత్యం నుంచి పురాణాల వరకు ఇక్కడ ఉన్నాయి. పాఠకుల అభిరుచులకు తగ్గట్టుగా అన్ని రకాల పుస్తకాలతో, మరెన్నో ప్రత్యేకమైన ఆకర్షణలతో కొఫోర్జ్ లైబ్రరీ కొత్త పాఠకులను ఆకట్టుకుంటున్నది!

మన శాఖా గ్రంథాలయాల్లో ‘సైలెన్స్ ప్లీజ్’ అనే బోర్డు ఉంటుంది. కానీ, అక్కడున్న ఫ్యాన్లు చేసే అల్లరికి ఇంకెవరు శబ్దం చేసినా వినపడదు. అర్థం కాదు. బహుశా ఆ ‘సైలెన్స్ ప్లీజ్’ హెచ్చరిక పాఠకులకు కాదేమో. అక్షరాలు చదవడం రాని ఫ్యాన్లు అర్థం చేసుకోలేక తిరుగుతూ, శబ్దం చేస్తూ ఇది ప్రభుత్వ గ్రంథాలయమని పదే పదే గుర్తు చేస్తూ ఉంటాయి. ఈ గ్రంథాలయాలను స్వర్గాలుగా ఊహించుకున్న వాళ్లెవరైనా ఫిర్యాదు చేస్తే ప్రభుత్వాలు పట్టించుకోవు. పోని ఆస్తిపన్ను మీద గ్రంథాలయ సెస్సు ఏమన్నా ఆపుతున్నారా? అంటే అదీ లేదు. ఆ డబ్బులు గ్రంథాలయాలకే ఖర్చు చేయాలని హైకోర్టు చెప్పినా ప్రభుత్వాలు వినవు. ఎవరో వస్తారని ఎదురుచూసే పుస్తక పాఠకుల కోసం కొఫోర్జ్ కంపెనీ ముందుకొచ్చింది.
ఈ గ్రంథాలయంలోకి అడుగుపెడితే ఓ బహుళజాతి కంపెనీ కార్యాలయంలోకి ప్రవేశించినట్టే ఉంటుంది! ఖరీదైన ఫర్నీచర్, విశాలమైన గదులు, సెంట్రల్ ఏసీ, సౌకర్యవంతమైన కుర్చీలు, విద్ద్యుద్దీపాల ధగధగలు, జిగేల్మనిపించే ఇంటీరియర్, ఇక పుస్తకాల గురించా… ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషల్లో పదిహేను వేల పుస్తకాలున్నాయి. ఆధ్యాత్మికం, సాహిత్యం, చరిత్ర, రాజకీయం, ఫిలాసఫీ, సైన్స్, టెక్నాలజీ ఎవరికి ఏది ఇష్టమో ఆ పుస్తకాలు చదువుకోవచ్చు. ఇక స్థానిక పత్రికలన్నీ వస్తాయి. దేశ విదేశాల నుంచి జర్నల్స్, మ్యాగజైన్లు కూడా వస్తాయి. హైటెక్ సిటీలో ఉంది కదాని ఐటీ పీపుల్ కోసం అన్నీ టెక్నాలజీ, కంప్యూటర్ పుస్తకాలే ఉంటాయనుకోవద్దు. అన్ని వయసుల వారికి, అన్ని అభిరుచుల వారు ఇష్టపడేలా ఈ గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. కథలు, నవలలు చదువుతూ కాలక్షేపం చేయొచ్చు.
పుస్తకాలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు గ్రంథాలయాలున్నాయి. కానీ, ప్రజలకు చదివే అవకాశం ఉన్న సెలవు రోజుల్లో గ్రంథాలయాలు మూసి ఉంటాయి. కానీ, కొఫోర్జ్ పబ్లిక్ లైబ్రరీ అలా కాదు. రీడర్స్ ఎప్పుడైనా వచ్చి చదువుకోవచ్చు. పబ్లిక్ హాలిడేలో పబ్లిక్ కోసం తెరిచే ఉంటుంది. 365 రోజులూ రావొచ్చు. చదువుకోవచ్చు. పైసా ఫీజు కట్టాల్సిన పనిలేదు. కానీ, ఈ గ్రంథాలయ నిబంధనలు మాత్రం పాటించాలి. ఫోన్ తప్ప మరే ఎలక్ట్రానిక్ ఉపకరణం తెచ్చుకోకూడదు. పుస్తకాల మీద రాయకూడదు. పేరు, ఫోన్ నంబరు చెప్పి నిమిషాల్లో ఉచితంగా సభ్యత్వం తీసుకుంటే ఎన్ని పుస్తకాలైనా చదువుకోవచ్చు. ఆ పుస్తకాన్ని ఇంటికి తీసుకెళ్లి చదువుకోవాలంటే ఓ వెయ్యి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇంటికి తీసుకెళ్లిన పుస్తకాన్ని 21 రోజుల్లో తిరిగిచ్చేయాలి.
కార్పొరేట్ సామాజిక బాధ్యతలో నగరంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ, ప్రజలకు జ్ఞానం పంచాలని, సమాజంలో జ్ఞానం పెరగాలనే తలంపుతో జరిగే ఈ చిన్న ప్రయత్నం భిన్నమైనదే కాదు. అభినందించాల్సింది కూడా! ‘రండి. కూర్చుని చదవండి’ అంటూ పాఠకులకు ఆహ్వానం పలుకుతున్న కొఫోర్జ్ పబ్లిక్ లైబ్రరీని హైటెక్ సిటీవాసులు బాగానే ఆదరిస్తున్నారు. అన్ని వయసుల వారూ వస్తున్నారు. అప్డేట్ కావడమంటే కేవలం మార్కెట్లో వచ్చే కొత్త వస్తువులు కొనడం, కొత్త టెక్నాలజీని వాడడమే కాదు. మన చుట్టూ సమాజం ఎలా మారుతుందో తెలుసుకోవడం. అందుకోసం అప్డేట్ అవ్వాల్సిందే. పుస్తకం చదవాల్సిందే!
పిల్లలది మరో ప్రపంచం. వాళ్ల కోసం ఇక్కడా ప్రత్యేకమైన ఏర్పాట్లున్నాయి. పిల్లల ఎత్తుకు తగ్గ కుర్చీలు, బల్లలు ఉన్నాయి. ఆడుతూ పాడుతూ చదువుకునేలా ప్రత్యేకమైన రీడింగ్ ఏరియా ఉంది. ఇక్కడే పిల్లలకు బాగా నచ్చే బొమ్మల కథలు, ఫెయిరీ టేల్స్, సాహస గాథలు, ఫిక్షన్ నవలలు, అమరచిత్ర కథలు, అరేబియన్ నైట్స్, షార్ట్ స్టోరీస్ పుస్తకాలు ఎన్నో ఉన్నాయి.
– నాగవర్ధన్ రాయల