షాద్‌నగర్, ఫిబ్రవరి 14 : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటు వేశారంటూ కాలసీవాసులపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కొన్నాళ్లపాటు తన పట్టా భూమి మీదుగా కాలనీలోకి ప్రజలు వెళ్తున్నా పట్టించుకోలేదని, తనకు అండగా నిలుస్తారని భావిస్తే వేరే పార్టీకి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడిస్తారా? అంటూ తన పట్టా భూమిగుండా ఉన్న బాటను జేసీబీతో తొలగించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీలోని 4వ వార్డులో వెలుగు చూసింది.
మున్సిపాలిటీ ఎన్నికల్లో 4వ వార్డు కౌన్సిలర్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ నాయకుడు తన పట్టా భూమి మీదుగా ఉన్న దారిని మూసివేశాడు. దీంతో చటాన్‌పల్లి గండెమ్మగడ్డ కాలనీవాసులు షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు.
ఈ దారిగుండా కొన్నేళ్లుగా రాకపోకలు సాగిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు, మున్సిపల్ అధికారులు స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత కాంగ్రెస్ నేత రాజేందర్‌రెడ్డిని వివరణ కోరగా.. ఉద్దేశపూర్వకంగా చేయాల్సిన అవసరం లేదని, తన సొంత పట్టా భూమి కావడంతో వ్యక్తిగత అవసరాల కోసం తవ్వకాలు చేపట్టాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ఈ విషయం గతంలోనే కాలనీవాసులకు తెలియజేశానని, ఈ దారి కాకుండా కాలనీవాసులకు మరోదారి ఉందని ఆయన వివరించాడు. రోడ్డును తవ్విన ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది.