Rahul Gandhi : లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల విదేశాలకు టూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భానికి సంబంధించి ఇటీవల ఒక ఫొటో వైరల్‌గా మారింది. ఒక బోటులో ఒక మహిళ, పక్కన ఒక బాలుడితోపాటు రాహుల్ ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఇది రాహుల్ ఫ్యామిలీ ఫొటో అంటూ కొందరు ప్రచారం మొదలెట్టేశారు. ఇప్పుడు ఇదే అంశంపై రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు. ఎక్స్ ఖాతాలో ఆ ఫొటోను షేర్ చేసి.. దానిపై ప్రశ్నించారు. ‘‘రాహుల్జీ.. ఈ ఫొటో ఎక్కడ తీసుకున్నారు..? ఎప్పుడు తీసుకున్నారు..? ఈ ఫొటోలో మీతోపాటు ఉన్నదెవరు..? తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది’’ అంటూ గిరిరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.
అయితే, ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ మండిపడింది. ఆ ఫొటోలో ఉన్న మహిళ రాహుల్ గాంధీ స్నేహితుడి భార్య అని, ఆ బాలుడు వారి కొడుకు అని చెబుతూ కాంగ్రెస్ సమాధానం ఇచ్చింది. రాహుల్‌తో కలిసి వారంతా విహార యాత్రకు వెళ్లారని, ఆ ఫొటోలు రాహుల్ స్నేహితుడు మాత్రం లేడని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే ఎక్స్ వేదికగా సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రిపై మండిపడ్డారు. ‘‘మీరు చాలా కామంతో కూడిన వ్యక్తి. ఒక మహిళ, ఒక మగాడు పక్కపక్కన కనిపిస్తే మీకు తప్పుడు ఆలోచనలు మాత్రమే వస్తాయి. మీలో ఉన్న చిరాకు, అసహనాన్ని ఇలా బయటపడనివ్వకండి’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ ఫొటో టెక్సాస్‌లోని లేక్ బే రాబర్ట్స్ వద్ద తీసుకున్నదని మరో కాంగ్రెస్ నేత తెలిపారు.
కావాలంటే తనిఖీ చేసుకోవచ్చు అని గిరిరాజ్ సింగ్‌కు సూచించారు. ఇలా పలువురు కాంగ్రెస్ నేతలు గిరిరాజ్ సింగ్‌పై విమర్శలు కురిపిస్తున్నారు. రాహుల్ గాంధీ జూన్ 22 నుంచి జూలై 13 మధ్య విదేశాలకు వెళ్లిపోయారు. ఆయన ఎక్కడికి వెళ్లారు.. ఆ ఖర్చులు ఎవరు భరించారు అంటూ బీజేపీ ఐటీ విభాగం అధినేత అమిత్ మాలవీయ గత నెలలో ప్రశ్నించారు.