– రూ.8 కోట్ల స్కాంలో సూత్రధారులు ఎవరు?
– మున్సిపల్ అధికారులపై ఫిర్యాదు చేస్తాం
కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఆగస్టు 11 : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి పారదర్శకత లేకుండా నిర్వహించిన రూ.9 కోట్ల 60 లక్షల డిపిఆర్ టెండర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేసి ఎమ్మెల్యే కూనంనేని చిత్తశుద్ధి నిరూపించుకోవాలని జైభీమ్ రావు భారత్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. మంగళవారం జేబీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనుల కోసం డిపిఆర్ లో రూ.9 కోట్ల 60 లక్షల విలువ చేసే టెండర్ ను కేవలం మూడు రోజులు మాత్రమే సమయం కేటాయించి మూడు రోజుల్లోనే టెండర్ ఓపెన్ చేయడం పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకమన్నారు. కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చినప్పుడు వాటిని రద్దు చేసి మరలా టెండర్ నిర్వహించాలని, కానీ అలా చేయకుండా మున్సిపల్ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా టెండర్ ఓపెన్ చేశారని, నిబంధనలను తుంగలో త్రొక్కి టెండర్ ఓపెన్ చేసిన అధికారులపై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
రూ.9 కోట్ల 60 లక్షల పనికి కనీసం 14 రోజుల గడువు ఇవ్వాలనే ఈ ప్రొక్యూర్మెంట్ నిబంధనలు ఉన్నాయన్నారు. టెండర్ ప్రక్రియలో రూ.8 కోట్ల స్కామ్ జరిగే అవకాశం ఉందని అసలు రూ.8 కోట్ల స్కాంలో సూత్రధారులు ఎవరని ప్రశ్నించారు. అధికారులు, స్థానిక శాసనసభ్యులు తక్షణమే టెండర్ రద్దు చేయాలని, లేనియెడల కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి డిపిఆర్ టెండర్ రద్దు అయ్యేవరకు పోరాడుతామని, అవసరమైతే న్యాయస్థానానికైనా వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు, కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షుడు నాగుల రవికుమార్, పట్టణ అధ్యక్షుడు గజ్జల శంకర్ పాల్గొన్నారు.