Hydraa | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సుమారు 40 ఎకరాల భూమి వివాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రాథమిక దశలోనే డిస్మిస్ చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంలో జరిగిన 219 రోజుల జాప్యంపై జస్టిస్ దీపాంకుర్దత్తా, జస్టిస్ షీల్నాగు ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ జాప్యానికి ప్రభుత్వం ఇచ్చిన కారణాలను ‘కుంటి సాకులు’గా పేరొంటూ అంగీకరించలేమని స్పష్టంచేసింది. దీంతో ఈ భూమి వివాదంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లోతుకుంట గ్రామంలోని సర్వే నంబర్లు 1, 2లోని 40 ఎకరాలు తమ పట్టా భూమి అని శాంతశ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాదిస్తున్నది.
1955లో నమోదైన విక్రయ పత్రంతోపాటు రెవెన్యూ రికార్డులను ఇందుకు ఆధారంగా చూపుతున్నది. కాగా ఈ భూమి 119.34 ఎకరాల విస్తీర్ణం కలిగిన జీఎల్ఆర్ సర్వే నంబర్ 243లో భాగమని, అది ప్రభుత్వ భూమి అని రాష్ట్రం పేరొంటున్నది. ప్రభుత్వ వాదనను సిటీ సివిల్ కోర్టు 2022 ఏప్రిల్ 19న తిరసరించగా, ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ 2025 అక్టోబర్ 7న కొట్టివేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పు అనంతరం ఎస్ఎల్పీ దాఖలులో 219 రోజుల జాప్యం జరిగిన అంశాన్ని ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించింది. 40 ఎకరాల విలువైన భూమికి సంబంధించిన వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని నిలదీసింది.
సంబంధిత అధికారులు వెంటనే న్యాయ సలహా తీసుకుని తదుపరి చర్యలు ప్రారంభించాల్సిందని పేరొంది. కొంతమంది అధికారుల తప్పిదాల కారణంగా ప్రభుత్వం నష్టపోవాలని తాము కోరుకోవడం లేదని, అయితే నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంచేసింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదంలో 1987 నుంచి ఇప్పటివరకు చాలా కాలం గడిచిపోయిందని, ఈ వ్యవధిలో పరిస్థితులు మారిపోయాయని ధర్మాసనం పేరొంది. ప్రభుత్వ న్యాయవాది అధికారులపై వ్యక్తిగతంగా విచారణ జరిపి చర్యలు తీసుకునే అంశాన్ని ప్రస్తావించగా, రాజ్యాంగబద్ధమైన అధికారిపై తాను చర్యలు తీసుకోలేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆలస్యానికి ఇచ్చిన వివరణను అంగీకరించకుండా, ప్రభుత్వ ప్రత్యేక అనుమతి పిటిషన్‌ను ప్రాథమిక దశలోనే డిస్మిస్ చేసింది.