– నూతన కాంట్రాక్టర్‌తో పనులు పునరుద్ధరించాల్సిందే
– స్పందించకపోతే న్యాయపోరాటం, ప్రత్యక్ష ఆందోళన
కోదాడ, ఆగస్టు 11 : ఎగవేతదారుల జాబితాలో ఉన్న డిఫాల్ట్ కాంట్రాక్టర్‌తో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కోదాడ పట్టణంలో చేపట్టిన అండర్ డ్రైనేజీ పనులతో ప్రజలు ఇబ్బందులకు, మనోవేదనకు గురవుతున్నారని, తక్షణమే సదరు పనులను నిలిపి వేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో అంతర్గత రహదారులు అస్తవ్యస్తంగా గుంతలమయమై వర్షపు నీళ్లతో ఉన్న అండర్ డ్రైనేజీ పనులను ముఖ్య నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆ వార్డు ప్రజలు ఈ పనులతో తాము పడుతున్న ఇబ్బందులను మాజీ ఎమ్మెల్యే ఎదుట వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి దంపతులకు కాంట్రాక్టులు, కమీషన్లపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని విమర్శించారు.
గతంలో సింగారం, మాధవరం రిజర్వాయర్ల మంచినీటి ప్రాజెక్టులు ఇంజినీరింగ్ వైఫల్యాల పేరుతో మంత్రి కోట్లు దండుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే డ్రైనేజీ పనులతో కోట్ల రూపాయల కమీషన్లు చేస్తుందన్నారు. ఈ పనులతో ప్రజలకు ప్రయోజనాలు కలగాల్సింది పోయి మరింత ఇబ్బందికి గురిచేస్తున్నాయన్నారు. ఈ పనుల కోసం తవ్విన గుంతలతో, నిలిచిన నీటితో పారిశుధ్య లోపం వల్ల దోమలు పెరిగి ప్రజలు మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉందన్నారు. వీధులు గుంతలమయమై వాహనాలు దిగబడి ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. వారానికి ఒకసారైనా మురికి కాలువలు బాగు చేసే పరిస్థితి లేదన్నారు. గతంలో పారిశుధ్య నివారణకు తమ హయాంలో 70 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమిస్తే వారి నుండి లక్షలు ముడుపులు తీసుకుని ఇప్పుడు తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు.
యు జి డి పనుల పైపులు వేసి నెలలు తరబడి ఆలస్యం చేయడంతో విద్యుత్, మిషన్ భగీరథ పైపులు పగిలి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే కలెక్టర్ జోక్యం చేసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసి పనులను పునరుద్ధరించాలన్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఆ పేరుతో నాణ్యత ప్రమాణాలను పక్కకు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సమర్థనీయం కాదన్నారు. డిఫాల్టర్ అయిన కాంట్రాక్టర్ స్థానంలో నిబద్ధతతో పనులు నిర్వహించే మరో కాంట్రాక్టర్ తో శాస్త్రీయ పద్ధతుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా యు జి డి పనులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు న్యాయపోరాటంతో పాటు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్, గొర్రె రాజేష్, కరీముల్లా, బాబా, ఉపేందర్ గౌడ్, మల్లయ్య గౌడ్, తాజ్, బాబా, చలిగంటి వెంకట్, జానీ, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

యుజిడి పనులను తక్షణమే నిలిపివేయాలి : కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్