Aravalli Hills | ఆరావళి పర్వతాల్లో (Aravalli Hills) గనుల తవ్వకాలపై సుప్రీంకోర్టు (supreme court) తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. స్థానిక భూమి ఉపరితలం నుంచి 100 మీటర్లు లేదా అంతకుమించి ఎత్తున ఉన్నవి మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణించబడతాయని, అంతకన్నా తక్కువ ఎత్తున ఉన్నవి ఆరావళి పర్వత శ్రేణుల పరిధిలోకి రావంటూ గతనెల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా నిరసనలకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం ధర్మాసనం.. గత నెల ఇచ్చిన తన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ (CJI Surya Kant), జె.కె. మహేశ్వరి, ఎ.జి. మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అంశాలను పరిశీలించడానికి కొత్త నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని (definition of hill) ధర్మాసనం ఆదేశించింది. అంతేకాదు, ఈ అంశంపై సుమోటోగా దాఖలైన కేసుపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి, ఆరావళి రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, హర్యానాకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 21కి వాయిదా వేసింది.
ఈ ఏడాది అక్టోబర్ 13న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ ఆరావళి పర్వతాలకు కొత్తగా 100 మీటర్ల నిర్వచనాన్ని సుప్రీంకోర్టు వద్ద ప్రతిపాదించిన విషయం తెలిసిందే. మంత్రిత్వశాఖ అందచేసిన 100 మీటర్ల నిబంధన సిఫార్సును సుప్రీంకోర్టు నవంబర్ 20న ఆమోదించింది. అయితే, సుప్రీం తీర్పుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆరావళిపై తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతూ న్యాయవాది, పర్యావరణ కార్యకర్త జితేంద్ర గాంధీ భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కి సోమవారం లేఖ రాశారు.
ఎత్తు ప్రాతిపదికన పర్వతాన్ని నిర్ణయించడం వల్ల అనాలోచితంగా అది వాయువ్య భారతదేశం వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణను బలహీనపరుస్తుందని రాష్ట్రపతికి కూడా పంపిన తన లేఖలో జితేంద్ర పేర్కొన్నారు. సుప్రీం తీర్పుతో ఆరావళి పర్వత శ్రేణుల్లో 90 శాతం పర్వతాలు రక్షణను కోల్పోతాయని, మైనింగ్, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగి పర్యావరణ విధ్వంసం జరుగుతుందని, థార్ ఎడారి ఢిల్లీ వరకు విస్తరించి భూగర్భ జలాల రీచార్జ్ నిలిచిపోవడంతోపాటు జీవ వైవిధ్యం దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Also Read..
Lalit Modi | మేం పరారీలో ఉన్న నేరస్థులం అంటూ వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన లలిత్ మోదీ
Nur Khan base | 36 గంటల్లో.. 80 డ్రోన్లు.. నూర్ ఖాన్ బేస్‌పై భారత దాడుల్ని అంగీకరించిన పాక్