Nur Khan base | ఈ ఏడాది మే నెలలో పాకిస్థాన్ (Pakistan)పై భారత్ దాడి చేసిన విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలే లక్ష్యంగా భీకర దాడులు చేసింది. ఈ దాడులకు ప్రతిగా.. పాక్‌సైన్యం న్యూఢిల్లీపై విరుచుకుపడేందుకు ప్రయత్నించింది. అయితే, ఆ ప్రయత్నాన్ని మన బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాక్ సైనిక స్థావరాలపై వరుస దాడులు చేశాయి. ఈ దాడిలో పాక్ ఆర్మీకి చెందిన కీలక స్థావరాలు ధ్వంసమయ్యాయి.
ఈ ఆపరేషన్ సందర్భంగా భారత దళాలు తమ నూర్ ఖాన్ వైమానిక స్థావరం (Nur Khan base)పై దాడి చేసినట్లు పాక్ తాజాగా బహిరంగంగా అంగీకరించింది. కేవలం 36 గంటల వ్యవధిలోనే దాదాపు 80కిపైగా డ్రోన్లను భారత్ ప్రయోగించినట్లు తెలిపింది. ఈ దాడిలో నూర్ ఖాన్ వైమానిక స్థావరం దెబ్బతిన్నదని వెల్లడించింది. సిబ్బంది కూడా గాయపడినట్లు అంగీకరించింది. డిసెంబర్ 27న జరిగిన విలేకరుల సమావేశంలో ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (Ishaq Dar) ఈ విషయాన్ని అంగీకరించారు.
పాక్ సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని భారత్ పెద్ద ఎత్తున డ్రోన్ దాడి చేసినట్లు పేర్కొన్నారు. ‘36 గంటల్లో కనీసం 80 డ్రోన్లను ప్రయోగించింది. వాటిలో 79 డ్రోన్లను అడ్డుకోగలిగాము. ఒక డ్రోన్ మాత్రమే సైనిక స్థావరాన్ని దెబ్బతీసింది. సిబ్బంది కూడా గాయపడ్డారు’ అని ఇషాక్ దార్ అన్నారు. రావల్పిండిలోని చక్లాలా ప్రాంతంలో ఉన్న ఈ నూర్ ఖాన్ వైమానిక స్థావరం వ్యూహాత్మకంగా దాయాదికి ముఖ్యమైనది. ఇది దేశ సైనిక ప్రధాన కార్యాలయం, రాజధానికి చాలా దగ్గరగా ఉంటుంది. భారత్ దాడిలో ఈ స్థావరం తీవ్రంగా దెబ్బతిన్నది.
Also Read..
Mexico Train Derailment | మెక్సికోలో పట్టాలు తప్పిన రైలు.. 13 మంది మృతి, 98 మందికి గాయాలు
Pakistan Cop | కిడ్నీ టచింగ్ యాక్టింగ్.. పాక్ పోలీస్ అధికారిణిపై నెటిజన్ల ట్రోల్స్
New jersey Helicopter Crash | న్యూజెర్సీలో రెండు హెలికాప్టర్లు ఢీ.. ఒకరు మృతి