Rahul Gandhi | పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah), ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా అమిత్ షా ప్రసంగాన్ని రాహుల్ గాంధీ అడ్డుకున్నారు. ఓటర్ల జాబితాల్లో జరిగిన అవకతవకలపై చర్చ జరుపాలని సవాల్ చేశారు. దీంతో అమిత్ షా ఎదురుదాడికి దిగారు. సభలో తాను ఏం మాట్లాడాలో అన్నది ఎవరూ నిర్దేశించలేరని అన్నారు. అయితే, షా ప్రసంగాన్ని ఉద్దేశించి రాహుల్ తాజాగా స్పందించారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ సమయంలో అమిత్ షా ఆందోళనగా, ఒత్తిడికి గురైనట్లు కనిపించారని రాహుల్ అన్నారు. ఆయన వాడిన భాష కూడా సరిగా లేదని వ్యాఖ్యానించారు. ‘నిన్న పార్లమెంటులో అమిత్‌షా జీ చాలా ఆందోళనగా కనిపించారు. ఆయన చేతులు వణుకుతున్నాయి. ఆయన వాడిన భాష కూడా సరిగా లేదు. అమిత్‌షా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఇది నిన్న దేశమంతా చూసింది. ఆయన ఏ ప్రశ్నకూ సరిగా సమాధానం ఇవ్వలేదు. వేటికీ ఆధారం చూపలేదు. మీడియా సమావేశంలో అమిత్‌షాని నాతో చర్చకు రావాలని సవాల్ విసిరాను. దానికి కూడా ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాలేదు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
కాగా, బుధవారం లోక్‌సభలో అమిత్ షా 90 నిమిషాల పాటూ ప్రసంగించారు. ఓటర్ల జాబితా నవీకరణ, అర్హత కలిగిన ఓటర్లను నిర్ధారించడం లక్ష్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) జరుగుతున్నదని అమిత్ షా తెలిపారు. ప్రతిపక్షాలు దీనిపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని విమర్శించారు. ‘మీరు గెలిచినప్పుడు ఓటర్ల జాబితాలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు కొత్త బట్టలు ధరించి ప్రమాణం చేస్తారు. కానీ బీహార్‌లో లాగా మీరు ఓడిపోయినప్పుడు ఓటర్ల జాబితాలో సమస్య ఉందని అంటారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు పని చేయవు’ అని ఆయన ఎగతాళి చేశారు. మరోవైపు ఓటర్ల జాబితాలపై రాహుల్ గాంధీ నిర్వహించిన మీడియా సమావేశాలు, ఓటు చోరీని ‘హైడ్రోజన్ బాంబు’గా పేర్కొనడంపై అమిత్ షా మండిపడ్డారు. ‘ప్రతిపక్ష నాయకుడు ‘ఓటు చోరీ’ గురించి మాట్లాడారు. అయితే కొన్ని కుటుంబాలు తరతరాలుగా ఓటు దొంగలు’ అంటూ పరోక్షంగా నెహ్రూ, ఇందిరా గాంధీ కుటుంబాలను ఆయన విమర్శించారు.
Also Read..
Tariffs | అమెరికా బాటలోనే మెక్సికో.. భారత్‌పై 50 శాతానికి సుంకాలు పెంపు
IndiGo | సంక్షోభం వేళ ఇండిగో కీలక ప్రకటన.. వారికి రూ.10 వేల విలువైన ట్రావెల్ వోచర్లు