న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కేంద్రంపై పోరాటాన్ని తీవ్రతరం చేసింది. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగడుతోంది. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను గుంజుకుంటూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌పై పోరును జాతి పోరాటంగా అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు.
తమ బిల్లులన్నీ రాజ్‌భవన్‌లో మగ్గుతున్నాయని తమిళనాడు సీఎం చెబుతున్నారని, ఇది కేవలం తమ పోరాటమే కాదని ఇది దేశవ్యాప్త పోరాటమని స్పష్టం చేశారు. ఢిల్లీ పోలీసులు మనీష్ సిపోడియాను ఎలా ట్రీట్ చేశారో మీరంతా చూశారని అన్నారు. ఢిల్లీలో బ్యూరోక్రాట్ల పోస్టింగ్, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.
అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల కోసం కేంద్రం నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ ఏర్పాటు దిశగా ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆప్ బీజేపీయేతర పార్టీల మద్దతును కోరింది. ఇది విపక్షాలకు అగ్నిపరీక్ష సమయమని దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడాలనుకునే పార్టీలు ముందుకు రావాలని ఆప్ పిలుపు ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కత్తిరిస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను టీఎంసీ కూడా వ్యతిరేకించింది. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తోందని దుయ్యబట్టింది.
Read More