Road Accident | మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది. ఝబువా (Jhabua) జిల్లాలో సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న ట్రైలర్ ట్రక్కు ఓ వ్యానును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెఘ్నగర్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన కొందరు వివాహ కార్యక్రమాన్ని ముగించుకొని తమ గ్రామానికి వ్యాన్‌లో వెళ్తున్నారు. అదే సమయంలో సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న ట్రైలర్ ట్రక్కు.. సంజేలి రైల్వే క్రాసింగ్ (Sanjeli railway crossing) వద్ద తాత్కాలిక రహదారి గుండా నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి దాటుతుండగా అదుపు తప్పింది. పక్కన వెళ్తున్న వ్యాన్‌పైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో వ్యాన్‌లోని తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ఝబువా పోలీసు సూపరింటెండెంట్ పద్మవిలోచన్ శుక్లా తెలిపారు. మరో ఇద్దరు గాయపడినట్లు చెప్పారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Corona Virus | కొత్తగా మరో 276 మందికి కరోనా పాజిటివ్.. 44కి పెరిగిన మృతుల సంఖ్య
Flood Situation | ఈశాన్య రాష్ట్రాల్లో వరదల బీభత్సం.. 43 మంది దుర్మరణం..!
NEET PG 2025 | ఆగస్టు 3న నీట్-పీజీ..! అనుమతి కోరుతూ సుప్రీంకోర్టుకు ఎన్బీఈ