Pahalgam Attack | ప్రశాంతంగా ఉండే కశ్మీర్ లోయ తూటాల శబ్దంతో మార్మోగిపోయింది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 26 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు.
మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో పచ్చిక బయలుపై కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై మంగళవారం మధ్యాహ్నం ఈ దాడి జరిగింది. పైన్ అడవి నుంచి వచ్చిన ఉగ్రమూక పర్యాటకుల వైపు దూసుకెళ్లింది. పురుషులే లక్ష్యంగా కాల్పులకు తెగబడింది. ఐదారుగుగురు ఉగ్రవాదులు మూడు ప్రదేశాలవైపుకు ఏకే47 రైఫిల్స్‌తో పరుగులు తీశారు. మధ్యాహ్నం 1:50 గంటల సమయంలో తొలి తూటా పేల్చిన ఉగ్రవాదులు.. 10 నిమిషాల్లోనే పని పూర్తి చేసుకొని వచ్చిన దారినే అడవిలోకి పారిపోయారు. ఇక దాడి జరిగిన అరగంట తర్వాత పోలీసులు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అప్పటికే ఉగ్రమూక తప్పించుకుని పారిపోయింది. ఇక ఉగ్రవాదులు బాడీ కామ్లు, హెల్మెట్‌లో అమర్చిన కెమెరాలు ధరించారని, మొత్తం దాడి దృశ్యాలను రికార్డు చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూతల్హాగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వీరంతా నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా అనుబంధ గ్రూపు రెసిస్టెన్స్ ఫ్రంట్ సభ్యులని తెలుస్తున్నది. సైనిక దుస్తులు, కుర్తా పైజామాలు ధరించి వచ్చిన ఐదారుగురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్టు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. దాడికి కొన్ని రోజుల ముందే ఈ గ్రూపుసహా పలువురు పాకిస్థానీ ఉగ్రవాదులు కశ్మీరులోకి చొరబడినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి.
పెహల్గామ్ ఉగ్రదాడి జరిపింది తామేనంటూ నిషిద్ధ లష్కరే తాయిబా అనుబంధ గ్రూపు ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ప్రకటించిన నేపథ్యంలో లష్కరే తాయిబా ముఖ్య నాయకుడు సైఫుల్లా కసూరీ ఈ దాడికి సూత్రధారిగా వ్యవహరించినట్టు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఇక ఇక టీఆర్ఎఫ్ గ్రూపునకు ఆసిఫ్ ఫౌజీ నాయకుడిగా ఉన్నట్టు వారు చెప్పారు. అడవుల మీదుగా తప్పించుకు పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా సంస్థలు హెలికాప్టర్ల ద్వారా జల్లెడ పడుతున్నాయి. ప్రాథమిక ఫోరెన్సిక్ విశ్లేషణ, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ప్రకారం ఉగ్రవాదులు మిలిటరీ-గ్రేడ్ ఆయుధాలు, అధునాతన కమ్యూనికేషన్ పరికరాలు ఉపయోగించారు. దీన్ని బట్టి వీరికి విదేశీ శక్తుల సహకారం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..
Pahalgam Attack | ముష్కర మూక ఇదే!.. పహల్గాం దాడులకు సూత్రధారి లష్కరే కమాండర్ సైఫుల్లా
Pahalgam Terror Attack | పాకిస్థానీయులకు దేశంలోకి ప్రవేశం నిషేధం.. భారత్ కీలక నిర్ణయాలు
Tourists | పహల్గాం ఉగ్రవాద దాడితో భయోత్పాతం.. కశ్మీర్‌ను వీడుతున్న పర్యాటకులు