Tourists | శ్రీనగర్: పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో పర్యాటకులు కశ్మీరు నుంచి వెళ్లిపోతున్నారు. వీరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జమ్ముకశ్మీరు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, పర్యాటకులు వెళ్లిపోతుండటం కలచివేస్తున్నదని, కశ్మీరు లోయ నుంచి అతిథులు వెళ్లిపోవడానికిగల కారణాలను తాము పూర్తిగా అర్థం చేసుకోగలమని తెలిపారు.
శ్రీనగర్ నుంచి కేవలం 6 గంటల్లో, 20 విమానాల్లో 3,337 మంది పర్యాటకులు వెళ్లిపోయారు. వీరంతా బుధవారం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల మధ్యలో భయాందోళనలతో కశ్మీరును విడిచిపెట్టారు. పలు వైమానిక సంస్థలు అదనంగా విమానాలను నడిపాయి.
పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు ఎయిర్‌లైన్ ఆపరేటర్లతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విమాన ప్రయాణ చార్జీలను పెంచకూడదని ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. శ్రీనగర్ నుంచి విమానాలను నడుపుతున్న అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు క్యాన్సిలేషన్, రీషెడ్యూలింగ్ చార్జీలను రద్దు చేశాయని చెప్పారు. విమానాశ్రయం వద్ద ఆహారం, తాగునీటిని అందజేస్తున్నట్లు తెలిపారు.
భారత ట్రావెల్ ఏజెంట్ల ఫెడరేషన్ అధ్యక్షుడు అజయ్ ప్రకాశ్ మాట్లాడుతూ, ఉగ్రవాద దాడి ప్రభావం పర్యాటకంపై కొంత కాలంపాటు ఉంటుందని చెప్పారు.
పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు ఇచ్చిన ఆదేశాలు ఆచరణలో అమలు కావడం లేదు. ఈ కష్టకాలంలో ప్రయాణికుల నుంచి అధిక టికెట్ చార్జీలను వసూలు చేయవద్దని ఆయన కోరినప్పటికీ ఎయిర్‌లైన్స్ సంస్థలు పట్టించుకోలేదు. ఇండిగో, స్పైస్ జెట్ విమానాల్లో గురువారం ప్రయాణించడానికి శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ఎకానమీ టికెట్ ధర రూ.11,000 నుంచి రూ.13,000 వరకు చేరుకుంది. ఎయిరిండియా టికెట్ ధర రూ.21,000 నుంచి రూ.23,000 వరకు ఉంది. టికెట్లు అమ్ముడుపోయినట్లు కొందరికి మెసేజ్‌లు వచ్చాయి. ప్రభుత్వ విధానానికి, ఆచరణకు మధ్య పొంతన లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని ప్రయాణికులు వాపోతున్నారు.
కశ్మీర్ అందాలను ఆస్వాదించాలనుకున్న పర్యాటకులు పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో తమ భద్రత పట్ల ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఢిల్లీ నుంచి బుక్ చేసుకున్న వారిలో దాదాపు 90 శాతం మంది తమ బుకింగ్స్‌ను రద్దు చేసుకున్నారు. ఇటువంటి వారిలో అత్యధికులు వచ్చే నెలలో కశ్మీరు సందర్శన కోసం వెళ్లవలసినవారే. కశ్మీరుకు వెళ్లేవారు మాత్రమే కాకుండా జమ్ములోని వైష్ణో దేవి ఆలయానికి వెళ్లాలనుకున్నవారు కూడా తమ బుకింగ్స్‌ను రద్దు చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి జమ్ముకశ్మీరుకు బుకింగ్స్ చేయవద్దని శ్రీనగర్ ట్రావెల్ అసోసియేషన్ చెప్పినట్లు ఢిల్లీలోని ఓ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆపరేటర్ చెప్పారు.