Pahalgam Terror Attack | న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై దౌత్యపరమైన చర్యలను భారత ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్థానీ జాతీయులకు భారత్‌లో ప్రవేశంపై నిషేధం విధించడం వంటి ఐదు అంశాలతో కూడిన చర్యలను భారత్ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం భద్రతా వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీతో సమావేశమై పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిస్థితిని సమీక్షించారు. సమావేశం అనంతరం భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై చేపట్టిన ఐదు చర్యలను ప్రకటించింది.
త్వరలోనే గట్టిగా బదులిస్తాం: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు త్వరలోనే గట్టి బదులిస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. కేవలం ఈ దాడికి పాల్పడిన వారినే కాకుండా, దానికి వ్యూహం పన్నిన వారినీ వేటాడుతామని ఆయన అన్నారు. పహల్గాం ఘటన, శ్రీనగర్‌లో భద్రతా చర్యల పటిష్ఠం తదితర అంశాలపై ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠిలతో చర్చల అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కొందరు పిరికివాళ్లు మతాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ ఉగ్రవాద చర్య కారణంగా మంగళవారం అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. పూర్తి అమానవీయమైన ఈ చర్య మనల్ని తీవ్ర దుఃఖం, బాధలోకి నెట్టేసింది’ అని ఆయన అన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అంతకుముందు ఆయన భద్రతా దళాలను ఆదేశించారు.