Pahalgam Attack | న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: జమ్ము కశ్మీరులోని పహల్గాంలో మంగళవారం పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఫొటోలు, ఊహాచిత్రాలను దర్యాప్తు సంస్థలు బుధవారం విడుదల చేశాయి. ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు అసువులు బాయగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజీ, సులేమాన్ షా, అబూతల్హాగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వీరంతా నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా అనుబంధ గ్రూపు రెసిస్టెన్స్ ఫ్రంట్ సభ్యులని తెలుస్తున్నది. సైనిక దుస్తులు, కుర్తా పైజామాలు ధరించి వచ్చిన ఐదారుగురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్టు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం బైసరాన్ పచ్చిక బయలుకు చేరువలో ఉన్న దట్టమైన పైన్ అడవుల్లో నుంచి అకస్మాత్తుగా వచ్చిన ఉగ్రవాదులు ఏకే 47 రైఫిల్స్‌తో పర్యాటకులపై కాల్పులు జరిపి వచ్చిన మార్గంలోనే తప్పించుకు పారిపోయారు. దాడికి కొన్ని రోజుల ముందే ఈ గ్రూపుసహా పలువురు పాకిస్థానీ ఉగ్రవాదులు కశ్మీరులోకి చొరబడినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి.
పహల్గాం ఉగ్రదాడి జరిపింది తామేనంటూ నిషిద్ధ లష్కరే తాయిబా అనుబంధ గ్రూపు ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ప్రకటించిన నేపథ్యంలో లష్కరే తాయిబా ముఖ్య నాయకుడు సైఫుల్లా కసూరీ ఈ దాడికి సూత్రధారిగా వ్యవహరించినట్టు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. టీఆర్ఎఫ్ గ్రూపునకు ఆసిఫ్ ఫౌజీ నాయకుడిగా ఉన్నట్టు వారు చెప్పారు. జమ్ము కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసిన తర్వాత కశ్మీరు లోయలో ఉగ్ర కార్యకలాపాలు తగ్గిపోయాయి. అప్పుడే టీఆర్ఎఫ్ ఏర్పడింది. సైఫుల్లా కసూరీ అలియాస్ ఖాలీద్ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద గ్రూపు లష్కరే తాయిబాకు సీనియర్ కమాండర్‌గా ఉన్నాడు.
లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడైన కసూరీ పహల్గాం ఉగ్ర దాడికి సూత్రధారిగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటన, భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన జరుగుతున్న సమయంలోనే ఈ దాడి జరగడం వెనుక కూడా కసూరీ వ్యూహమున్నట్లు అనుమానాలు ఉన్నాయి. భారీ స్థాయిలో మారణహోమం సృష్టించడం ద్వారా అంతర్జాతీయంగా ప్రచారం పొందాలని టీఆర్ఎఫ్ కుట్ర పన్ని ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
అడవుల మీదుగా తప్పించుకు పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా సంస్థలు హెలికాప్టర్ల ద్వారా జల్లెడ పడుతున్నాయి. ప్రాథమిక ఫోరెన్సిక్ విశ్లేషణ, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ప్రకారం ఉగ్రవాదులు మిలిటరీ-గ్రేడ్ ఆయుధాలు, అధునాతన కమ్యూనికేషన్ పరికరాలు ఉపయోగించారు. దీన్ని బట్టి వీరికి విదేశీ శక్తుల సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు బాడీ కామ్లు, హెల్మెట్‌లో అమర్చిన కెమెరాలు ధరించారని, మొత్తం దాడి దృశ్యాలను రికార్డు చేశారని కూడా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ముష్కరులు పూర్తి స్థాయి సన్నద్ధతతో వచ్చారని, డ్రైఫ్రూట్లు, ఔషధాలను కూడా నిల్వ చేసి పెట్టుకున్నారని తెలుస్తోంది. స్థానికుల సాయంతో ఉగ్రవాదులు కొన్ని రోజుల ముందు పహల్గాంలో రెక్కీ నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇద్దరు ఉగ్రవాదులు పష్తోలో(పాకిస్థానీ మూల భాష) మాట్లాడారని, మరో ఇద్దరు స్థానికులని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానిక ఉగ్రవాదులు బిజ్‌భేరా, త్రాల్‌కు చెందినవారని వారు చెప్పారు. దాడి జరిగిన తీరు, ఉగ్రవాదులు ఏకే 47 రైఫిల్స్‌ను ఉపయోగించిన విధానాన్ని బట్టి చూస్తే వీరంతా ఆయుధ శిక్షణ పొందినట్లు అర్థమవుతోందని వారు తెలిపారు. ఉగ్రవాదుల డిజిటల్ పాదముద్రలు ముజఫరాబాద్, కరాచీలోని సురక్షిత గృహాలను చూపుతున్నాయని, దీని వెనుక సీమాంతర ఉగ్రవాదుల హస్తం ఉన్నదన్న అనుమానాలను బలపరుస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి.
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా హతమార్చిన క్రమంలో యురి సెక్టార్లో మన దేశంలోకి చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. నియంత్రణ రేఖ దాటి వీరు మన దేశంలోకి రావడానికి ప్రయత్నిస్తుండగా, సైనికులు అడ్డుకుని కాల్పులు జరిపారు. వీరిద్దరూ ఉగ్రవాదంలో సుశిక్షితులై ఉంటారని భావిస్తున్నారు. వీరిద్దరి వద్ద చిన్నపాటి యుద్ధానికి సరిపడా ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉందని, వాటిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రాంతంలో భద్రతా దళాల గాలింపు ఇంకా కొనసాగుతున్నదని, ఇంకా ఎవరైనా ప్రవేశించి ఉంటారా అన్నది నిశితంగా పరిశీలిస్తున్నట్టు వారు చెప్పారు.
కుల్గాంలో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. టీఆర్ఎఫ్ టాప్ కమాండర్ ఒకరిని బలగాలు చుట్టుముట్టినట్టు సమాచారం. భారత్‌లో అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ఇద్దరు ముష్కరులను ముట్టుబెట్టిన కాసేపటికే తంగ్‌మార్గ్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకున్నది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దక్షిణ కశ్మీరులో ప్రశ్నించే నిమిత్తం నేరచరిత్ర కలిగిన వందలాది మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. గతంలో ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నట్లు రికార్డుల్లోకెక్కిన కార్యకర్తలతోపాటు ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్న దాదాపు 1500 మందిని దక్షిణ కశ్మీరు వ్యాప్తంగా అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.