Endometriosis | మహిళల్లో వచ్చే గర్భాశయ సంబంధిత సమస్యల్లో ఎండోమెట్రియోసిస్ కూడా ఒకటి. ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయం లోపలి పొర లాంటి కణజాలం గర్భాశయ వెలుపల పెరిగే ఒక పరిస్థితి. ఈ కణజాలం గర్భాశయం బయట పెరగడం వల్ల తీవ్రమైన నొప్పితో పాటు ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఇది కేవలం నెలసరినే కాదు రోజువారీ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. పునరుత్పత్తి వయసులో ఉన్న మహిళల్లో దాదాపు 10 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తోంది. ఎండోమెట్రియోసిస్ సాధారణంగా కటి లేదా ఉదరంలోని పునరుత్పత్తి అవయవాలపై లేదా చుట్టూ కనిపిస్తుంది. ఫెలోపియన్ ట్యూబ్స్, గర్భాశయం చుట్టూ ఉన్న లిగమెంట్స్, పెల్విక్ కవిటీ లైనింగ్, ఓవరీస్, గర్భాశయం, రెక్టం లేదా మూత్రాశయం మధ్య భాగం, గర్భాశయం బయటి ఉపరితలం వంటి భాగాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అరుదుగా ఇది మూత్రాశయం, సర్విక్స్, పేగులు, రెక్టం, పొట్ట, వజైనా/వల్వా ప్రాంతాల్లో కూడా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఎండోమెట్రియోసిస్ వల్ల తీవ్రమైన నొప్పి, తిమ్మిర్లు వస్తాయి. చాలా మంది దీనిని సాధారణ పీరియడ్స్ నొప్పిగా భావించి పట్టించుకోరు. కానీ ప్రతి నెలసరి నొప్పి సాధారణం కాదు. కొన్ని లక్షణాలు ఎండోమెట్రియోసిస్కు సంకేతం కావచ్చు. పీరియడ్స్ నొప్పి ఎండోమెట్రియోసిస్ కావచ్చని సూచించే కొన్ని లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పీరియడ్స్ క్రాంప్స్ కొంచెం నొప్పిగా ఉంటాయి. విశ్రాంతి లేదా మందులతో తగ్గుతాయి. కానీ ఎండోమెట్రియోసిస్లో నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. పీరియడ్స్ ప్రారంభానికి ముందు నుంచే మొదలై చాలా రోజుల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో బయట పెరిగిన కణజాలం కూడా పీరియడ్స్లాగే రక్తస్రావం చేసి వాపు కలిగిస్తుంది. దీంతో చుట్టూ ఉన్న అవయవాలు, నరాలు కూడా ఇబ్బందికి గురవుతాయి.
చాలా మంది మహిళలు ఈ నొప్పి వల్ల వారి పనులను కూడా వారు చేసుకోలేకపోతారు. అలాగే పీరియడ్స్ ముగిసిన తర్వాత కూడా పొత్తికడుపు లేదా పెల్విస్ ప్రాంతంలో నొప్పి ఉంటే దానిని సాధారణంగా భావించకూడదు. ఇది నిరంతర ఒత్తిడి, తట్టుకోలేని నొప్పి లేదా మంటలా అనిపించవచ్చు. ఇది అవయవాలు ఒకదానికొకటి అంటుకోవడం లేదా దీర్ఘకాలిక వాపు వల్ల వస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా ఈ నొప్పి రావచ్చు. అదే విధంగా సంభోగం సమయంలో లేదా తరువాత పెల్విస్, నడుము లేదా తొడల్లో నొప్పి ఉంటే అది ఎండోమెట్రియోసిస్ సంకేతం కావచ్చు. ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్ లేదా పెల్విక్ లైనింగ్ మీద ఉన్న లెషన్స్ కదలిక వల్ల నొప్పి పెరుగుతుంది. కొంతమందిలో ఈ నొప్పి సంభోగం తర్వాత గంటల పాటు కొనసాగుతుంది.
పీరియడ్స్ సమయంలో చాలా ఎక్కువగా రక్తస్రావం అవడం, ప్రతి గంటకోసారి ప్యాడ్ లేదా టాంపాన్ మార్చుకోవాల్సి రావడం, ఒక వారం కంటే ఎక్కువ రోజులు పీరియడ్స్ కొనసాగడం కూడా ఎండోమెట్రియోసిస్ లక్షణం కావచ్చు. అదనపు కణజాలం నుండి ఒకేసారి రక్తస్రావం కావడం వల్ల ఇలా జరుగుతుంది. కొంతమందిలో పీరియడ్స్ మధ్యలో కూడా స్పాటింగ్, వాపు, అలసట వంటి సమస్యలు కనిపిస్తాయి. అలాగే పీరియడ్స్ సమయంలో డయేరియా, మలబద్ధకం, మలంలో రక్తం వంటి సమస్యలు రావడం, తరచుగా మూత్రం రావడం, మూత్ర విసర్జన సమయంలో మంట ఉండటం కూడా కనిపించవచ్చు. ఇది పెల్విక్ ప్రాంతంలో వాపు పెరగడం వల్ల సమీప అవయవాలపై ఒత్తిడి పడటం వల్ల జరుగుతుంది.
కొంతమందికి నడుము, తొడలు, మోకాళ్లు లేదా హిప్స్ లో నొప్పి ఉంటుంది. ఇది సయాటిక్ నరంపై ఒత్తిడి వల్ల రావచ్చు. కొన్నిసార్లు కాళ్లలో స్పర్శ లేనట్టుగా లేదా బలహీనత కూడా అనిపించవచ్చు. ఎండోమెట్రియోసిస్ ఉన్న మహిళలకు తీవ్ర అలసట, వాంతులు, తల తిరిగినట్టుగా ఉండడం, మెదడు మత్తుగా ఉండటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది శరీరంలో వాపు పెరగడం వల్ల జరుగుతుంది. అలాగే ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ కావడం లేదా ఓవరియన్ సిస్ట్స్ వల్ల కొందరిలో గర్భధారణకు ఆటంకం కలగడంతో పాటు వంధ్యత్వం సంభవిస్తుంది.
ఈ లక్షణాలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా సమస్య మరింత తీవ్రతరం కాకుండా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.