– నాగినేనిప్రోలు రెడ్డిపాలెం అభివృద్ధి పనుల విషయంలో సర్పంచ్‌ను పట్టించుకోని వైనం
– ప్రోటోకాల్ పాటించని ఎమ్మెల్యే, ఐటీసీ యాజమాన్య వైఖరికి నిరసనగా ధర్నా
బూర్గంపహాడ్, మార్చి 13 : బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గిరిజన మహిళా సర్పంచ్, పాలకవర్గానికి శుక్రవారం ఘోర పరాభవం ఎదురైంది. సొంత పంచాయతీలో అభివృద్ధి పనుల విషయంలో ఐటీసీ యాజమాన్యంతో మాట్లాడి సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు సీఎస్ఆర్ నిధుల కోసం రూ.50 లక్షలకు ప్రతిపాదనలు పంపి చివరకు పనులను ప్రారంభించే సమయంలో అటు ఐటీసీ యాజమాన్యం, ఇటు ఎమ్మెల్యే సైతం పంచాయతీ ప్రథమ పౌరురాలుగా ఉన్న బీఆర్ఎస్ గిరిజన మహిళా సర్పంచ్‌ను పిలవకుండా హడావుడిగా వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోవడం పట్ల పాలకవర్గం తీవ్రంగా మండిపడింది. ఈ విషయంలో అవమానానికి గురైన గిరిజన మహిళా సర్పంచ్ బానోత్ సరోజ ప్రోటోకాల్ పాటించలేదని, గిరిజన సర్పంచ్ ఉన్నందుకే ఇలా తనను అవమానానికి గురిచేశారంటూ ఉప సర్పంచ్ అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులతో కలిసి సారపాకలోని ఐటీసీ ప్రధాన గేటు వద్ద ధర్నా చేపట్టి నిరసన తెలిపారు.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నాగినేనిప్రోలు రెడ్డిపాలెం నుండి బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థినిగా పోటీచేసి బానోత్ సరోజ మెజార్టీతో గెలవడంతో పాటు 14 వార్డు స్థానాలను కైవసం చేసుకుని పంచాయతీని క్లీన్ స్వీప్ చేశారు. పంచాయతీలో ప్రజా సమస్యల పరిష్కార ధ్యేయంగా పని చేస్తున్న సర్పంచ్ ఇటీవల కాలంలో పంచాయతీ అభివృద్ధిలో భాగంగా సీఎస్ఆర్ నిధులతో సైడ్ డ్రైన్లు నిర్మించాలని ప్రతిపాదనలు సైతం పంపగా నాలుగు డ్రైనేజీలకు రూ.50 లక్షల నిధులు కేటాయించి తాజాగా శుక్రవారం ఐటీసీ యాజమాన్యం ఈ పనులను ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేను ఆహ్వానించినా సర్పంచ్, పాలకవర్గానికి ఆహ్వానం లేదు.
మండల పర్యటనలో భాగంగా వచ్చిన ఎమ్మెల్యే సైతం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో రూ.50 లక్షలతో నిర్మాణ పనులు చేపట్టనున్న నాలుగు సైడ్ డ్రైన్ల నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారే తప్పా ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్‌ను పిలవలేదు. గిరిజన -సర్పంచ్ కావడమే చేసిన నేరమా, తన విషయంలో ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని అటు ఐటీసీ యాజమాన్యం, ఇటు ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ ఉప సర్పంచ్, పాలకవర్గంతో కలిసి ఐటీసీ గేటు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉప సర్పంచ్ అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు 14 వార్డులకు చెందిన వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు దారం కృష్ణారెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, బానోత్ రాందాస్, మొండెద్దుల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.