Anti-Missile System : గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఆ దేశాలపై ఇరాన్ దాడుల నుంచి రక్షణ కోసం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా గల్ఫ్ దేశాలకు అమెరికా సిద్ధం చేసిన డిఫెన్స్ రక్షణ వ్యవస్థను తరలిస్తోంది. టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (టీహెచ్ఏఏడీ) మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ అని పిలిచే ఈ రక్షణ వ్యవస్థను అమెరికా.. గల్ఫ్ దేశాలకు తరలించడం ఇప్పుడు సంచలనంగా మారింది. కారణం.. ఈ వ్యవస్థ దక్షిణ కొరియాలో ఉండటమే.
ఉత్తర కొరియాతో దక్షిణ కొరియాకు, అమెరికాకు ఉన్న శతృత్వం గురించి తెలిసిందే. అందుకే అటు దక్షిణ కొరియాకు అండగా ఉంటూనే, ఉత్తర కొరియాను ఎదుర్కొనేందుకు వీలవుతుందనే ఉద్దేశంతో అమెరికా.. దక్షిణ కొరియాలో టీహెచ్ఏఏడీ అనే మిస్సైల్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే, ఇప్పుడు గల్ఫ్ దేశాలకు ఇరాన్ నుంచి రక్షణ కావాలి కాబట్టి.. ఈ సిస్టమ్‌ను చాలా వరకు మిడిల్ ఈస్ట్‌కు తరలిస్తోంది అమెరికా. ఇదే ఇప్పుడు దక్షిణ కొరియా అసంతృప్తికి కారణంగా నిలుస్తోంది. ఎందుకంటే ఈ వ్యవస్థ దక్షిణ కొరియా నుంచి వెళ్తే ఉత్తర కొరియా నుంచి వచ్చే మిస్సైళ్లను అడ్డుకోవడం కష్టమవుతుంది. ఈ దేశ భద్రత ప్రమాదంలో పడుతోంది.
అందుకే అమెరికా నిర్ణయంపై ద.కొరియా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అమెరికా ఆర్మీ బేస్‌ను, డిఫెన్స్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోనిచ్చినప్పుడే దక్షిణ కొరియా ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఆ దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత అమెరికాదే. అలాంటిది ఇప్పుడు ఆ దేశ రక్షణకు ఉపయోగపడే టీహెచ్ఏఏడీని వేరే దేశాలకు తరలిస్తే తమ భద్రత ఎలా అని ద.కొరియా ఆందోళన చెందుతోంది. ద.కొరియాలో అమెరికాకు చెందిన ఆర్మీ బేస్ ఉంది. ఇక్కడ యూఎస్ అణ్వాయుధాలతోపాటు 28,500 మంది అమెరికన్ సైన్యం, సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వంటివి అమెరికా ఏర్పాటు చేసింది. అమెరికా నిర్ణయాన్ని ద.కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ వ్యతిరేకించారు. అయితే, ఇప్పుడు గల్ఫ్ మిషన్ పూర్తైన తర్వాత ఆ సిస్టమ్‌ను తిరిగి తమ దేశానికే తీసుకురావాలని ఆయన కోరుతున్నారు.
అలాగే దేశ రక్షణ కోసం విదేశాలపై ఆధారపడకుండా సొంతంగా డిఫెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని అక్కడి వారు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో భారీ యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేస్తుంటే.. ఇరాన్.. ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలు, టర్కీ వంటి ఇతర దేశాలపై కూడా దాడులు చేస్తోంది. అందుకే ఇరాన్ దాడుల్నుంచి తమ మిత్ర దేశాలైన గల్ఫ్ కంట్రీస్‌ను రక్షించేందుకు అమెరికా డిఫెన్స్ సిస్టమ్ తరలింపు నిర్ణయం తీసుకుంది.