అహ్మదాబాద్: ఒక మహిళ పెద్ద కోడలు, చిన్న కొడుకు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. దీనిని ఆమె వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి ఆ మహిళను హత్య చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. (Surat woman killed) గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. 55 ఏళ్ల హమీదా ఖాతూన్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడి భార్య, పెద్ద కోడలైన షబానా, చిన్న కుమారుడు పర్వేజ్ మధ్య వివాహేతర సంబంధాన్ని ఆమె వ్యతిరేకించింది. ఆ ఇంట్లో ఆర్థిక వివాదాలు కూడా తలెత్తాయి.
ఈ నేపథ్యంలో మార్చి 10న పర్వేజ్, షబానా, ఆమె తండ్రి ఫిరోజ్ ఆలం కలిసి హమీదా ఖాతూన్ గొంతునొక్కి హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని సంచిలో కుక్కి ఇంట్లో దాచారు. మరునాడు షబానా తండ్రి పిరోజ్ ఆలం మృతదేహం ఉన్న ఆ సంచిని మోసుకెళ్లి ఒక గుడి వద్ద పడేశాడు. మార్కెట్‌కు వెళ్లిన తన తల్లి ఇంటికి తిరిగి రాలేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో పర్వేజ్ ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదైంది.
కాగా, మార్చి 11న గుడి వద్ద పడేసిన మూటలో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె కాళ్లు, చేతులు తాడుతో కట్టి ఉండటాన్ని గమనించారు. మృతురాలిని హమీదా ఖాతూన్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా గొంతునొక్కి ఆమెను చంపినట్లు నిర్ధారణ అయ్యింది.
మరోవైపు పోలీసులు హమీదా ఖాతూన్ ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఆమె ఇద్దరు కుమారులతో పాటు పెద్ద కోడలైన షబానాను ప్రశ్నించారు. మృతదేహం కాళ్లు, చేతులు కట్టేసిన తాడు వంటిది ఆ ఇంట్లో గుర్తించారు. దీంతో ఆ కుటుంబంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పెళ్లి కాని చిన్న కుమారుడు పర్వేజ్, పెద్ద కోడలు షబానాను మరింతగా ప్రశ్నించారు.
అయితే తమ మధ్య సంబంధంతో పాటు ఆర్థిక వివాదాల వల్ల హమీదా ఖాతూన్‌ను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని పోలీస్ అధికారి తెలిపారు. దీంతో పర్వేజ్, షబానాను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
కాగా, ఈ హత్యలో మరో నిందితుడైన షబానా తండ్రి ఫిరోజ్ ఆలం మృతదేహం ఉన్న సంచిని పడేయటాన్ని సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. బీహార్ పారిపోయిన అతడ్ని పాట్నా రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
అయితే షబానా తండ్రి ఫిరోజ్ ఆలం, హతురాలు హమీదా ఖాతూన్ మధ్య కూడా చాలా ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నదని, దీని వల్ల ఆ కుటుంబంలో గొడవలు జరిగినట్లు తెలిసిందని పోలీస్ అధికారి వివరించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు నిందితులు కలిసి ఆమెను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
Also Read:
Wife Runs Away | భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. మరో వ్యక్తితో భార్య పరార్