Bomb Threats | దేశరాజధాని ఢిల్లీలోని పలు విద్యాసంస్థలకు (Delhi Schools) వరుస బాంబు బెదిరింపులు (Bomb Threats) ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా మూడో రోజైన బుధవారం నగరంలోని ఐదు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఢిల్లీలోని ద్వారక, వసంత్ కుంజ్, హౌస్ ఖాస్, పశ్చిమ్ విహార్, లోది ఎస్టేట్‌లో ఉన్న ఐదు పాఠశాలలకు బుధవారం ఉదయం ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి.
ద్వారకలోని సెయింట్ థామస్ స్కూల్, వసంత్ కుంజ్‌లోని వసంత్ వ్యాలీ స్కూల్, హౌజ్ ఖాస్‌లోని మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్, పశ్చిమ్ విహార్‌లోని రిచ్మండ్ గ్లోబల్ స్కూల్, లోది ఎస్టేట్‌లోని సర్దార్ పటేల్ పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. తరగతి గదుల చుట్టూ ఉంచిన బ్యాక్ప్యాక్లలో పేలుడు పరికరాలు ఉంచినట్లు బెదిరింపు సందేశంలో పేర్కొన్నారు. రోడ్‌కిల్, బెంజీ పేరుతో ఈమెయిల్స్ పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ బెదిరింపు మెయిల్స్‌తో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో ఆయా పాఠశాలల వద్దకు చేరుకున్నారు.
పాఠశాలలను ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. వీటితోపాటు ఇవాళ ఉదయం 7:15 గంటల సమయంలో సెయింట్ స్టీఫెన్స్ కళాశాలకు (St Stephens College) కూడా బాంబు బెదిరింపులు వచ్చినట్లు గుర్తించారు. మంగళవారం కూడా ఈ కళాశాలను లక్ష్యంగా చేసుకొని ఆగంతకులు బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, గత మూడు రోజుల వ్యవధిలోనే ఢిల్లీలోని దాదాపు 10 పాఠశాలలు, ఒక కళాశాలకు ఇటువంటి బాంబు బెదిరింపులు వచ్చాయి.
Also Read..
Aadhaar | కోట్ల మంది చనిపోయినా ఇంకా యాక్టివ్‌లోనే ఆధార్ కార్డులు.. ఆర్టీఐ రిపోర్ట్‌లో వెల్లడి
ChatGPT | చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం.. సోషల్ మీడియా ద్వారా యూజర్లు ఫిర్యాదు