రాయ్‌పూర్: ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజర్ల కొరత ఏర్పడింది. దీంతో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురి మృతదేహాలను స్ట్రెచర్లపై వదిలేశారు. (Bodies Left On Stretchers) మరునాడు అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు కుళ్లుతున్న తమ వారి మృతదేహాలను చూసి ఆవేదన చెందారు. కోల్‌కతాకు చెందిన ఐదుగురు వ్యక్తులు అక్టోబర్ 5న మధ్యప్రదేశ్‌లోని కన్హా జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించారు. రైలులో కోల్‌కతాకు తిరిగి వెళ్లేందుకు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ రైల్వే స్టేషన్‌కు బొలేరోలో బయలుదేరారు.
కాగా, ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్ధామ్ జిల్లా కవర్ధా ప్రాంతంలో వేగంగా వెళ్తున్న లారీ బొలేరోను ఢీకొట్టింది. ఆ వాహనంలో చిక్కుకున్న వారిని అతికష్టంగా బయటకు తీశారు. బోడ్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే డ్రైవర్‌తో పాటు కోల్‌కతాకు చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు.
మరోవైపు ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క ఫ్రీజర్ మాత్రమే ఉన్నది. దీంతో డ్రైవర్ మృతదేహాన్ని అందులో భద్రపరిచారు. కోల్‌కతాకు చెందిన ఐదుగురి మృతదేహాలను స్ట్రెచర్లపై ఉంచారు. షీట్లు కప్పి రోజంతా బయట వదిలేశారు.
కాగా, ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న కోల్‌కతా మృతుల కుటుంబ సభ్యులు మరునాడు ఆ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే స్ట్రెచర్లపై ఉంచిన తమ వారి కుళ్లుతున్న మృతదేహాలను చూసి వారు ఆవేదన చెందారు.
మరోవైపు పోస్ట్‌మార్టం తర్వాత మరింత దుర్వాసన రావడంతో ఇద్దరి వ్యక్తుల మృతదేహాలకు స్థానికంగా అంత్యక్రియలు నిర్వహించారు. మిగతా ముగ్గురి మృతదేహాలను కోల్‌కతాకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో తగినన్ని ఫ్రీజర్లు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read:
Watch: కొండచరియలు విరిగిపడిన రోగులకు చికిత్స కోసం.. పెద్ద సాహసం చేసిన డాక్టర్
Watch: విద్యార్థిపై పోలీస్ అధికారి ప్రతాపం.. యువకుడిని కొట్టి తిట్టిన వీడియో వైరల్
Watch: కుక్కల బెడదపై వీధి నాటకం.. ఆర్టిస్ట్‌ను కరిచిన వీధి కుక్క