బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 15:01:35

భారత్‌ విడిచి వెళ్లేందుకు తబ్లిగీ జమాతీలకు మార్గం సుగమం

భారత్‌ విడిచి వెళ్లేందుకు తబ్లిగీ జమాతీలకు మార్గం సుగమం

న్యూఢిల్లీ : ఎట్టకేలకు విదేశీ తబ్లిగీ జమాతీలు వారి స్వస్థలాలకు బయల్దేరి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. వారి పాస్ట్‌పోర్టులను క్రైమ్‌ బ్రాంచ్‌ తిరిగి ఇచ్చేయడంతో దాదాపు 400 మంది విదేశీ జమాతీలు త్వరలో భారత్‌ నుంచి బయల్దేరనున్నారు. అన్ని ఫార్మాలిటీలు ముగిసిన తర్వాత  విదేశీ జమాతీల పాస్‌పోర్టులు తిరిగి ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులో పేర్కొన్నట్లు క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపాయి.

ఫిబ్రవరి-మార్చి నెలల మధ్య న్యూఢిల్లీ శివారులోని నిజాముద్దీన్ వద్ద రెండు వేలకు పైగా విదేశీ జమాతీలు మార్కజ్‌కు హాజరయ్యారు. అనంతరం విదేశీ జమాతీలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారని క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. పర్యటన నిమిత్తం భారత్‌ వచ్చిన విదేశీ జమాతీలు.. నిబంధనలను అతిక్రమించి మర్కజ్‌కు హాజరయ్యారంటూ ఆరోపిస్తూ క్రైమ్‌ బ్రాంచ్‌ వారి పాస్‌పోర్టును జప్తుచేసింది. ఇదే సమయంలో ఢిల్లీ విపత్తు నిర్వహణ చట్టం, లాక్డౌన్ మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ వారిపై కేసులు కూడా నమోదయ్యాయి.

పర్యాటక వీసాపై వచ్చిన వీరంతా మత బోధన చేశారని, ఇది వీసా ఉల్లంఘన కావడంతో విదేశీయుల చట్టం కింద వారిపై కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వీరంతా నిర్బంధంలో గడిపారు. ఢిల్లీలోని వివిధ కోర్టుల్లో తమ నేరాన్ని అంగీకరించి, వ్యక్తిగత బాండ్‌ను సమర్పించిన 585 మంది విదేశీ జమాతీలను విడుదల చేసినట్లు తెలిసింది. కొందరు తమ విడుదల కోసం హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ నిర్బంధానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు.

క్రైమ్ బ్రాంచ్ వారిపై 48 చార్జిషీట్లు, 11 అనుబంధ చార్జిషీట్లను దాఖలు చేసింది. నిజాముద్దీన్ మార్కజ్‌లోని తబ్లిగీ జమాత్‌కు సంబంధించిన కార్యకలాపాల్లో పెద్ద సంఖ్యలో విదేశీయులు హాజరైనట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే 900 మందికి పైగా విదేశీయులను దర్యాప్తులో చేర్చారు. విదేశీయులు చాలా మంది టూరిస్ట్ వీసా లేదా ఈ-వీసాపై భారత్‌ వచ్చారని, అయితే వీరంతా మత సంబంధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఢిల్లీ పోలీసులు కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో పేర్కొన్నారు.

సోమవారం మొత్తం 132 మంది విదేశీ జమాతీలు ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. 132 మందిలో 121 మంది నేరాన్ని అంగీకరించారు. అభ్యర్ధన బేరసారంలో ప్రవేశించిన జమాతీలు ఒక్కొక్కరికి రూ.5 వేల జరిమానా విధించారు. విదేశీయులు జమ చేసిన జరిమానాను పీఎం కేర్స్ ఫండ్‌కు బదిలీచేస్తారు. నేరాన్ని అంగీకరించడానికి నిరాకరించిన వారు తదుపరి విచారణను ఎదుర్కొంటారు. 955 మంది విదేశీ పౌరులపై ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయగా.. 583 మందికి సంబంధించిన విచారణ పూర్తయినట్లుగా సమాచారం.


logo