Himachal Pradesh | హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (red alert) జారీ చేసింది. భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నది ఉప్పొంగి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ఈ వర్షాలకు ఇప్పటి వరకూ మండి జిల్లాలో నలుగురు మరణించారు. కనీసం తొమ్మిది మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోగా.. 19 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకూ 99 మందిని రక్షించినట్లు చెప్పారు. ఈ వర్షాలకు పది ఇళ్లు, 12 గోశాలలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.
చండీగఢ్-మనాలీ హైవేలోని మండి-మనాలీ మార్గంలో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొండచరియలు విరిగిపడిన కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా మంగళవారం మండిలోని అన్ని విద్యా సంస్థలను అధికారులు మూసివేశారు. కాంగ్రా, సిర్మౌర్, సోలన్ జిల్లాల్లోని పాఠశాలలను కూడా మూసివేశారు. మండి, సిర్మౌర్ జిల్లాల్లోని దాదాపు 250కిపైగా రహదారులను అధికారులు మూసివేశారు. అంతేకాదు 614 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 130 నీటి సరఫరా పథకాలు ప్రభావితమయ్యాయి. ఇక ఈ సీజన్లో వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 23కి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
పొరుగున ఉన్న ఉత్తరాఖండ్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తరకాశి, బాగేశ్వర్, పిథోరగఢ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో అనేక జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. చమోలిలో జులై 1 నుంచి 1-12వ తరగతి వరకూ అన్ని తరగతులకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Also Read..
Baba Ramdev | సహజంగానే మనిషి ఆయుర్దాయం 150 నుంచి 200 ఏళ్లు : బాబా రామ్‌దేవ్
Air India | అకస్మాత్తుగా 900 అడుగుల కిందకు దిగిన ఎయిర్ ఇండియా విమానం..