Himachal Pradesh | ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను గత కొన్ని
రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. జూన్ 24వ తేదీన రాష్ట్రంలోకి
రుతుపవనాల ప్రవేశించాయి. ఇక అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తోంది. ఎడతెరిపి
లేకుండా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల
కొండచరియలు విరిగిపడుతున్నాయి. పలు ఇళ్లు, రోడ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. పంటలు
దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రంలో రూ.వేల కోట్ల నష్టం వాటిల్లింది.
ఈ సీజన్లో కురిసిన భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల రూ.7020.28 కోట్ల నష్టం
వాటిల్లినట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. ఇక జూన్ 24వ తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా
257 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. మరో 32 మంది గల్లంతయ్యారని, 290 మంది
గాయపడినట్లు పేర్కొన్నారు.
‘ఈ సీజన్లో మొత్తం 257 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో కొండచరియలు, ఆకస్మిక వరదల
కారణంగా 66 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల 191 మంది
మరణించారు. 32 మంది గల్లంతయ్యారు. సుమారు 290 మంది గాయపడ్డారు’ అని అధికారులు
తెలిపారు.
ఈ విపత్తు కారణంగా రాష్ట్రంలో సుమారు 1,376 ఇళ్లు దెబ్బతిన్నాయని, మరో 7,935 ఇళ్లు పాక్షికంగా
దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 270 దుకాణాలు, 2,727 గోశాలలు దెబ్బతిన్నట్లు చెప్పారు. ఈ సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 90 కొండచరియలు విరిగిపడటం, 55 ఆకస్మిక వరద సంఘటనలు సంభవించినట్లు చెప్పారు. ఇప్పటికీ రాష్ట్రంలో 2 జాతీయ రహదారులు సహా దాదాపు 450 రోడ్లు మూసుకుపోయాయని వెల్లడించారు.
Also Read..
Bedurulanka 2012 | అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేయోద్దు.. కార్తికేయ స్ట్రాంగ్ రిప్లయ్
Hardik Pandya | ఓటమి మంచిదే.. సిరీస్ చేజారడంపై పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి.. ఏడుగురు మృతి